పులుల ఆహారం కోసం జింకలు.! 4 ప్రాంతాల్లో 600 జింకల పెంపకం

పులుల ఆహారం కోసం జింకలు.! 4 ప్రాంతాల్లో 600 జింకల పెంపకం

 

  • 4 ప్రాంతాల్లో 600 జింకలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు
  • ఇప్పటికే 200కు పైగా అడవులకు తరలింపు  
  • త్వరలో మరో 400 తరలించేందుకు ప్రణాళిక  
  • ఆహారం దొరక్క పులులు జనావాసాల్లోకి వస్తుండడంతో సర్కార్ చర్యలు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో పులుల దాడులు పెరుగుతున్నాయి. అడవుల్లో ఆహారం లభించకపోవడంతో అవి జనావాసాల్లోకి చేరి పశువులు, మనుషులపై దాడులు చేస్తున్నాయి. కాగజ్‌‌నగర్, పెంచికల్‌‌పేట రేంజ్, కుమ్రంభీమ్ జిల్లా వాంకిడి, కొండలింగాలవలస పంచాయతీ తదితర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. పులులకు ఆహారమైన జింకల పెంపకంపై దృష్టిసారించింది. జింకలను పెంచి అడవుల్లో వదిలిపెట్టాలని ఆదేశాలిచ్చింది. సర్కార్ ఆదేశాలతో అధికారులు 4 ప్రాంతాల్లో జింకల పునరుత్పత్తి చేస్తున్నారు. హైదరాబాద్‌‌లోని నెహ్రూ జూపార్కు, వనస్థలిపురంలోని హరిణ వనస్థలి, ఆమ్రాబాద్‌‌లోని చెన్నారం, దూలపల్లిలో జింకలను పెంచుతున్నట్టు అధికారులు తెలిపారు. మొత్తం 600 వరకు జింకలు ఉన్నట్టు తెలిసింది. నెహ్రూ జూపార్కులో 200, హరిణ వనస్థలిలో 400 వరకు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. చెన్నారం పార్కులో జింకల బ్రీడింగ్ నిర్వహిస్తున్నట్టు సమాచారం.  

పులుల సంఖ్యకు అనుగుణంగా.. 

రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ప్రస్తుతం 45కు పైగా పులులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వాటి సంఖ్య పెరుగుతుండడంతో అదే స్థాయిలో జింకల పెంపునకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో 600కు పైగా జింకలు పెంచుతున్నారు. వాటి ఉత్పత్తిని మరింత పెంచి పులుల సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విడిచిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో దాదాపు 400 చుక్కల దుప్పులు, కృష్ణ జింకలు, మనబోతు, ఖనుజులను పులులు ఉన్న ఆవాసాలకు తరలించనున్నట్టు అధికారులు తెలిపారు. 

పులుల స్థిరనివాసానికి చర్యలు.. 

పులుల స్థిరనివాసం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఆహారం లభించే ప్రాంతాల్లోనే పులులు నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో జింకల సంఖ్య పెంపునకు అధికారులు కృషి చేస్తున్నారు. కవ్వాల్‌‌, ఆమ్రాబాద్‌‌ పులుల సంరక్షణ కేంద్రాలతో పాటు కిన్నెరసాని, ఏటూరునాగారం, పాకాల అభయారణ్యాలలో జింకలను వదిలిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వైల్డ్‌‌ లైఫ్‌‌ ప్రొటెక్షన్‌‌ యాక్ట్‌‌ 1972 ప్రకారం అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ ఈ తరలింపు ప్రక్రియ చేపట్టినట్టు అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని అడవుల్లో వన్యప్రాణుల సంపదను మరింత పెంచేందుకు జూపార్కుల్లో పెద్ద సంఖ్యలో ఉన్న శాకాహార జంతువులను పులుల అభయారణ్యాలకు, రక్షిత అటవీ ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించినట్టు అటవీ శాఖ పేర్కొంది.

అభయారణ్యాలకు తరలింపు..
  
రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంఖ్య పెంచేందుకు అటవీశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. వరంగల్‌‌లోని కాకతీయ జూపార్క్‌‌ నుంచి 20 చుక్కల దుప్పులు, 13 సాంబార్‌‌ జింకల(ఖనుజు)ను ఇటీవల ఏటూరు నాగారం అభయారణ్యానికి తరలించారు. అదే విధంగా హైదరాబాద్‌‌లోని నెహ్రూ జూపార్క్‌‌ నుంచి ఆమ్రాబాద్‌‌ టైగర్‌‌ రిజర్వ్‌‌కు 19 చుక్కల దుప్పులను తరలించారు. రెండో విడతలో భాగంగా మరో 200 వరకు జింకలను ఆమ్రాబాద్ అడవుల్లో వదిలిపెట్టినట్టు సమాచారం.