- ఏఐ ఆధారిత యాప్ రూపొందించిన సర్కార్
- కంపెనీలు, విద్యార్థులు/నిరుద్యోగులకు మధ్య వారధి
- అటు కంపెనీలు, ఇటు స్టూడెంట్లు
- రిజిస్టర్ అయ్యేలా చర్యలు
- ఇప్పటికే 15 వేల మంది స్టూడెంట్లు, 67 సంస్థల నమోదు
- జాబితాలో డాక్టర్ రెడ్డీస్, ఫాక్స్‌కాన్, బీడీఎల్, హ్యుందాయ్ లాంటి ప్రముఖ కంపెనీలు
హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ సంస్థల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యార్థులు, నిరుద్యోగులు ప్రైవేట్ కొలువులు పొందేలా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) యాప్‌ను తీసుకొచ్చింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పని చేస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులను ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలతో లింక్ చేసేలా అధికారులు యాప్‌ను అభివృద్ధి చేశారు. దీన్ని పల్లెల్లోని నిరుద్యోగులు, విద్యార్థులు కూడా వాడుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. పోయినేడాది డిసెంబర్ 4న డీట్ యాప్‌ను ప్రారంభించగా.. ఇప్పటి వరకు 67 సంస్థలు, 15 వేల మంది విద్యార్థులు అందులో రిజిస్టర్ అయ్యారు. డీట్ నిర్వహణ కోసం పరిశ్రమల శాఖలో ప్రత్యేకంగా ఒక వింగ్ ఏర్పాటు చేశారు.
ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లలో ఈ యాప్‌ను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ సౌకర్యం లేనివాళ్లు, హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థులు deet.telangana.gov.in వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ అయ్యే అవకాశం కల్పించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలు కచ్చితంగా 20 నుంచి 30 శాతం వరకు రిక్రూట్మెంట్లను డీట్ ద్వారా చేయాలన్న షరతునూ సర్కార్ విధిస్తున్నది.
ఎన్రోల్మెంట్పై దృష్టి..
పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కోర్సులకు చెందిన ఫైనల్ ఇయర్ స్టూడెంట్లు డీట్‌లో నమోదు చేసుకునేలా కాలేజీ మేనేజ్మెంట్లతో అధికారులు కో ఆర్డినేట్ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ఆఫీసర్, టెక్నికల్ఎడ్యుకేషన్, కాలేజ్ఎడ్యుకేషన్, టాస్క్(రీజనల్ మేనేజర్) సహకారం తీసుకుంటున్నారు. విద్యార్థులు యాప్‌లో నమోదు చేసుకునేందుకు కాలేజీల్లో ప్లేస్‌మెంట్స్ అండ్ ట్రైనింగ్ కోఆర్డినేటర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వాళ్లు ఎప్పటికప్పుడు డీట్ కోఆర్డినేటర్లతో టచ్‌లో ఉండి విద్యార్థులు ఎన్రోల్అయ్యేలా చూస్తున్నారు.
దీన్ని మానిటర్చేసేందుకు జిల్లాల్లో ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్‌ను నియమించారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు, విద్యార్థులు రిజిస్టర్ అయ్యేలా చూసేందుకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో టాస్క్ రీజనల్ మేనేజర్లు సభ్యులుగా డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీలనూ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లోని విద్యార్థులను ఎన్రోల్ చేయిస్తుండగా.. ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులనూ ఎన్రోల్ చేయించేలా కోఆర్డినేట్ చేస్తున్నారు.
38 వేల స్కిల్స్..
డీట్ యాప్‌లో విద్యార్థులు/నిరుద్యోగులు, కంపెనీలకు వేర్వేరుగా రిజిస్ట్రేషన్అవకాశం కల్పించారు. యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాక విద్యార్థులు/నిరుద్యోగులు.. అందులో ఈ–మెయిల్ లేదా ఫోన్నంబర్తో రిజిస్టర్ అయి తమ వ్యక్తిగత వివరాలు, విద్యా ర్హతలు, వారికున్న నైపుణ్యాల వివరాలను ఎంటర్చేయాలి. వారి వివరాల ఆధారంగా ఏఐ అల్గారిథం ద్వారా యాప్‌లోనే ఆటోమేటిక్‌గా ఓ రెజ్యూమె కూడా తయారవుతుంది. ఈ యాప్‌లో 38 వేల స్కిల్స్‌ను పొందుపరిచారు. అభ్యర్థుల విద్యార్హతలకు అనుగుణంగా పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్, వర్క్‌ఫ్రమ్ హోమ్ వంటి అవకాశాలతో పాటు ఇంటర్న్‌షిప్ చాన్స్‌లు కూడా కల్పిస్తున్నారు. అయితే, ఎప్పటికప్పుడు డీట్ యాప్ లేదా ఆన్లైన్లో లాగిన్ అయి జాబ్స్ గురించి చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 3 నెలల పాటు లాగిన్ కాకుంటే.. సదరు అభ్యర్థిని ఇనాక్టివ్జాబ్ సీకర్ కింద పెడతారని చెప్తున్నారు.
అంతా ఆన్లైన్లోనే..
డీట్ యాప్‌లో కంపెనీలు కూడా ఎన్రోల్ చేసుకుని, తమకు ఎలాంటి స్కిల్స్ఉన్నోళ్లు కావాలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా రిజిస్టర్ అయిన కంపెనీలతో విద్యార్థులు/నిరుద్యోగులను మ్యాచ్చేసేలా ఓ ప్రత్యేకమైన ఏఐ అల్గారిథంను యాప్‌లో వాడుతున్నారు. ఈ ఏఐ అల్గారిథం.. విద్యార్థుల స్కిల్స్ఆధారంగా ఆయా సంస్థలకు వారి వివరాలను పంపిస్తుంది. కంపెనీలను తమకు కావాల్సిన అర్హతలున్న విద్యార్థులు/నిరుద్యోగులతో ఏఐ ‘మ్యాచ్’ చేస్తుంది. విద్యార్థి/నిరుద్యోగి, సంస్థ మ్యాచ్ అయ్యాక.. సదరు అభ్యర్థులతో సంస్థ చాట్‌బాక్స్‌లో చర్చిస్తుంది.
తర్వాత కంపెనీ ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తుంది. ఒకవేళ సంస్థ ఆ విద్యార్థి/నిరుద్యోగిని కావాలనుకుంటే.. ఆఫర్ లెటర్ ఇస్తుంది. అయితే, ఆ ఆఫర్‌ను యాక్సెప్ట్ చేయాలా? వద్దా? అన్నది పూర్తిగా ఆ అభ్యర్థి ఇష్టానికే వదిలేస్తారు. జాబ్ వచ్చేదాకా ప్రాసెస్ అంతా ఆన్లైన్లోనే జరగడం విశేషం. ఎప్పటికప్పుడు జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ మేళాల వివరాలూ వచ్చేలా యాప్‌ను డెవలప్ చేశారు. విద్యార్థులు, కంపెనీల డేటా సేఫ్‌గా ఉండేలా స్టేట్ డేటా సెంటర్ ఆధ్వర్యంలోని డేటాబేస్‌లో భద్రపరుస్తున్నారు.
ప్రముఖ కంపెనీలు నమోదు..
డీట్ యాప్‌లో ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. ఆటోమొబైల్స్, ఐటీ, ఫార్మా, ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఔట్సోర్సింగ్, మ్యాన్ ఫ్యాక్చరింగ్, హెల్త్‌కేర్ రంగాలకు చెందిన సంస్థలు డీట్‌లో నమోదు చేసుకున్నాయి.
డాక్టర్ రెడ్డీస్, ఫాక్స్‌కాన్, బీడీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్, భారత్ హ్యుండయ్, డెక్స్టారా డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్, డియోస్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, జీఐఎస్ఇండ్, హెచ్డీబీ ఫైనాన్స్సర్వీసెస్, హెచ్ఆర్ చాంబర్స్ ఔట్సోర్సింగ్ ప్రైవేట్ లిమిటెడ్, క్వెస్‌కార్ప్ లిమిటెడ్, రాయ్స్ ఎడ్యుకేషనల్కన్సల్టెన్సీ, సెయిలో టెక్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీచక్ర పాలిప్లాస్ట్ప్రైవేట్లిమిటెడ్, ఎస్‌ఎస్‌ఎస్‌వీ సొల్యూషన్స్, స్టాన్ప్లస్టెక్నాలజీస్, సింక్రోసర్వ్గ్లోబల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, థరారే గ్లోబల్ సొల్యూషన్స్, వాలరో టెక్నాలజీస్, వి మేక్స్కాలర్స్, యంగ్ స్టర్స్ ఆఫ్ హైదరాబాద్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్వంటి సంస్థలు అందులో ఉన్నాయి. కాగా, 520 లెక్చరర్, టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ డీట్ ద్వారా ఎన్రోల్ చేసుకుంది.