చేనేత అభయహస్తంతో నేతన్నలకు మేలు

సూర్యాపేట, వెలుగు : చేనేత అభయహస్తం నేతన్నలకు ఎంతో మేలు చేస్తుందని సూర్యాపేట చేనేత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు కడారి భిక్షం అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రూ.168 కోట్లతో చేనేత అభయ హస్తం ద్వారా నేతన్నలకు పొదుపు, భద్రత, భరోసా పథకాలకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు. నేతన్న పొదుపు నిధి కింద రూ.115 కోట్లు, నేతన్న భద్రతకు రూ.9 కోట్లు, నేతన్న భరోసా కు రూ.44 కోట్లు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపిన వెంటనే చేనేత ,జౌళి శాఖ ముఖ్యకార్యదర్శి  శైలజారామయ్యర్ ఉత్తర్వులు జారీ చేసి నేతన్నలకు సంక్రాంతి కానుక ఇచ్చారని తెలిపారు. ఈ మూడు పథకాలకు ఏర్పాటుకు సహకరించిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్​కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సహకార సంఘం ప్రధాన కార్యదర్శి నరసింహారావు, కోశాధికారి బాల్నే మల్లయ్య, నాయకులు పాల్గొన్నారు. 

సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

చండూరు, వెలుగు : త్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి చండూరు చేనేత సహకార సంఘం ప్రధాన కార్యదర్శి కర్నాటి శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం చండూరు లోని సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. అనంతరం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.