పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు
  • కొల్లాపూర్‌‌లో సన్నబియ్యం పంపిణీ 

కొల్లాపూర్, వెలుగు: పేద ప్రజల సంక్షేమమే ప్రజాప్రభుత్యం లక్ష్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ మేరకు కొల్లాపూర్  పట్టణ కేంద్రంలో బుధవారం సన్నబియ్యం పంపిణీ  పథకాన్ని ఆయన  ప్రారంభించారు. కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో  మూడు రేషన్ షాపుల్లో  సన్నబియ్యం పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కడుపు నింపేందుకే  రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం అందిస్తుందన్నారు. గత ప్రభుత్వం 9 ఏళ్లలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, ప్రజా పాలనలో రేషన్ కార్డులు అందిస్తామని ఆయన అన్నారు.  ఎన్నికల హామీలో సన్నబియ్యం పథకం లేకున్నా ప్రజలకు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో బన్సిలాల్, రేషన్ డీలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నిందితులకు శిక్ష పడేలా చేస్తాం

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు:  ఊర్కొండపేట దేవాలయ సమీపంలో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులకు త్వరగా శిక్ష పడే విధంగా రాష్ట్ర  ప్రభుత్వం తరఫున అన్నిరకాల చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం సాయంత్రం నాగర్ కర్నూల్ పట్టణంలోని ఎస్పీ ఆఫీసులో అత్యాచార ఘటనపై జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రెస్ మీట్ నిర్వహించారు. 

మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు జరగడం దారుణమన్నారు.  తల్లిదండ్రులు, పిల్లలకు విలువలు నేర్పించడంతో పాటు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రధాన దేవాలయాల వద్ద, ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ రామేశ్వర్, డీఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు.