
- మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోకి 210 గ్రామాల విలీనం
- ఉపాధి హామీతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోల్పోతున్న పేదలు
- 76 గ్రామాలతో ఫ్యూచర్ సిటీ అథారిటీ
- మేడ్చల్ జిల్లాలో 61, ఇతర జిల్లాల్లో 73 పంచాయతీలు విలీనం
హైదరాబాద్, వెలుగు: పట్టణాల్లో పల్లెల విలీనంతో పేదలు ఉపాధి హామీ పథకానికి దూరమవుతున్నారు. ప్రభుత్వం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 210 గ్రామాలను మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో విలీనం చేసింది. ఫ్యూచర్ సిటీ అథారిటీ పరిధిలోకి 76 గ్రామాలను తీసుకురాగా.. మేడ్చల్ జిల్లాలో 61 గ్రామాలను, వివిధ జిల్లాల్లో మరో 73 పల్లెలను మున్సిపాలిటీల్లో కలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీల్లోని పేదలకు మాత్రమే ఉపాధి హామీ పథకం కింద పని కల్పించాలి.
దీంతో ఆయా గ్రామాల్లో ఇన్ని రోజులు ఉపాధి హామీ పథకం కింద లబ్ధి పొందిన పేదలు.. ఇప్పుడు ఆ పథకానికి దూరం కానున్నారు. ఆయా గ్రామాల్లో ఈ నెల నుంచే ఉపాధి హామీ పథకాన్ని నిలిపివేస్తూ పంచాయతీరాజ్ శాఖ అధికారులు నిర్ణయించారు. దీంతో తాము ఆర్థికంగా ఇబ్బందులు పడతామని, ప్రభుత్వం చొరవ తీసుకుని పట్టణ పేదరిక నిర్మూలన కింద ఉపాధి కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.
నష్టపోతున్నామని జనం ఆవేదన
ప్రభుత్వం పట్టణీకరణ పేరుతో పల్లెలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తుండటంతో తమకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతున్నదని పేదలు వాపోతున్నారు. ఉపాధి హామీ పథకం కింద లభించే వంద రోజుల పనికి దూరం అవుతున్నామని, ఆయా పని దినాల్లో రోజుకు రూ.307 చొప్పున లభించే కూలీని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 100 రోజుల్లో కనీసం 50 రోజులు పని చేసినా రూ.15 వేలు వచ్చేవని, అవి కుటుంబం గడవడానికి చేదోడువాదోడుగా ఉండేవని అంటున్నారు. తమకు వ్యవసాయమే జీవనాధారమని, పొలం పనులు లేనప్పుడు ఉపాధి కూలీకి వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నామని చెబుతున్నారు.
విలీన గ్రామాలివే..
మేడ్చల్ జిల్లాలో 61 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. హైదరాబాద్ శివారు యాచారం, కందుకూరు, కడ్తాల్, ఆమనగల్, మహేశ్వరం మండలాల్లోని 76 గ్రామాలతో ప్యూచర్ సిటీ అథారిటీని సర్కారు ఏర్పాటు చేసింది. ఇక జిల్లాల్లో ములుగు మున్సిపాలిటీలో 3, ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో 6, కామారెడ్డి జిల్లా బిచ్‌కుంద మున్సిపాలిటీలో 4, మేడ్చల్ జిల్లా అలియాబాద్, మూడు చింతలపల్లి, ఎల్లంపేట మండలాల్లో 36, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 4 గ్రామాలను విలీనం చేసింది.
అలాగే రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేటలో 2, చేవెళ్లలో 4, మొయినాబాద్‌లో 5, భద్రాద్రి జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీలో 4, సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో 2, నారాయణపేట జిల్లా మద్దూరులో 4 గ్రామాలు, జగిత్యాల జిల్లాలో ఒక గ్రామం విలీనమయ్యాయి.
ఆ జిల్లాల్లో కొనసాగించొచ్చు?
ఫ్యూచర్ సిటీలో కలిపిన రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 76 గ్రామాల్లో ఉపాధి హామీ పథకం వర్తింపజేయవచ్చని అధికారులు అంటున్నారు. ఈ జిల్లాలు పూర్తిగా హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. అయితే నిర్మాణ అనుమతులు మాత్రమే హెచ్ఎండీఏ అధికారులు ఇస్తున్నారు. కానీ ఆయా గ్రామాల్లో పాలనా వ్యవహారాలు మాత్రం పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలు చూస్తున్నాయి. ఈ విధానం కొనసాగిస్తే ఆ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం వర్తింపజేయవచ్చని చెబుతున్నారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకూ దూరం
విలీన గ్రామాల ప్రజలు ఉపాధి హామీని కోల్పోవడంతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికీ దూరమవుతున్నారు. ఈ పథకం కింద ప్రభుత్వం భూమి లేని నిరుపేద కూలీలకు ఏటా రూ.12 వేలు ఆర్థిక సాయం అందజేస్తున్నది. అయితే భూమి లేకుండా ఉపాధి హామీ పథకం కింద పనిచేసేనోళ్లే దీనికి అర్హులు. మున్సిపాలిటీల్లో విలీనంతో ఉపాధి హామీ పథకానికి దూరమవుతున్న పేదలు.. తద్వారా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకూ దూరం కానున్నారు. ప్రభుత్వం నిరుపేదలను దృష్టిలో ఉంచుకుని విలీన గ్రామాల్లోనూ ఈ పథకం కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు.