
- మార్చి 31 వరకు 25 శాతం రాయితీ
- ఎల్‌ఆర్‌ఎస్ బాధ్యతలు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు..
- ఇప్పటికే ఆ శాఖకు అందిన ఎఫ్‌టీఎల్, సర్కార్ భూముల లిస్ట్
జగిత్యాల, వెలుగు: ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం) ప్రక్రియను వేగవంతం చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ద్వారా నేరుగా రెగ్యులర్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇప్పటికే ధరఖాస్తుల ఫీజులో 25 శాతం రాయితీ ఇస్తుండడంతో ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ ఊపందుకోనుంది.
ఈక్రమంలో బల్దియాతోపాటు రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌కు ఆదాయం సమకూరనుంది. దీంతోపాటు అక్రమ లేఅవుట్లకు నిర్ణీత ఫీజు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకొనే అవకాశం ఉంది. ఫ్లాట్ల అమ్మకపు, కొనుగోళ్లు మరింత సులువుకానున్నాయి.
స్పీడప్ చేసిన సర్కార్
ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ల వెరిఫికేషన్ మూడు స్టేజీల్లో మొదట స్టేజ్ ఎల్-1 లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల తో పాటు ఇరిగేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్ఆఫీసర్లు ఫీల్డ్ విజిట్ చేయాల్సి ఉండగా.. ఈ పని పూర్తయింది. ఆ తర్వాత రెగ్యులరైజేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ ప్రక్రియ గతంలో స్లోగా సాగగా.. ప్రస్తుతం ప్రభుత్వం స్పీడప్ చేసింది. రెగ్యులరైజేషన్ ఫీజులో 25 శాతం మినహాయింపు ఇచ్చింది. సర్కార్ భూములు, ఎఫ్టీఎల్ భూముల వివరాలను ఇప్పటికే రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌కు అందించారు. దీనిలో భాగంగా ఎల్ఆర్ఎస్ సాఫ్ట్‌వేర్ డేటాను ఆ శాఖ బదిలీ చేసుకునే వీలు కల్పించారు. దీంతోపాటు ఆన్‌లైన్‌లో రెగ్యులరైజేషన్ ఫీజు నిర్ణయించే విధానం అమలు చేస్తున్నారు. బఫర్ జోన్ పరిధి, నిషేధిత సర్వే నంబర్ల జాబితాలతో పోల్చి.. అభ్యంతరాలు లేని భూములకు నేరుగా ఫీజు నిర్ణయించి.. సబ్ రిజిస్ట్రార్ల వద్ద చెల్లించేలా ఆదేశాలు జారీ చేశారు.
ఉమ్మడి జిల్లా లో 1,14,439 అప్లికేషన్లు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో బల్దియాలతో పాటు గ్రామ పంచాయితీల్లో 1,14,439 ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో 6,892 అప్లికేషన్లు అప్రూవ్ కాగా.. 1,184 రిజెక్ట్ అయ్యాయి. అప్రూవ్ అయిన అప్లికేషన్లకు సంబంధించి ఇప్పటికే ఫ్లాట్ల ఓనర్లకు ప్రొసీడింగ్స్ కూడా అందజేశారు.
అప్లికేషన్ల వివరాలిలా..
జిల్లా అప్లికేషన్లు అప్రూవ్డ్ రిజెక్డెడ్
జగిత్యాల 27,369 322 361
కరీంనగర్ 40,463 891 309
సిరిసిల్ల 26,829 2526 355
పెద్దపల్లి 19,778 3,153 159
అక్రమ లేఅవుట్ల రెగ్యులర్‌కు అవకాశం
సర్కార్ అక్రమ లేఅవుట్ల ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులర్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇందుకోసం మార్చి31 లోపు చేసుకునే వారికి 25 శాతం రాయితీ ఇస్తున్నారు. ఎల్ఆర్ఎస్ పూర్తయితేనే ప్లాట్ల విక్రయాలు, ఇళ్ల నిర్మాణాల సమయంలో ఇబ్బంది ఉండదు. సర్కార్ తీసుకున్న మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రక్రియను ముందుకు తీసుకెళ్తాం. శ్రీనివాస్, డీటీసీపీ జగిత్యాల