
- బీసీ రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంట్లో ఆమోదించాలి: మంత్రి పొన్నం
- 16 నెలల పాలనలో 69 వేల ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడి
- డెహ్రాడూన్‌లో చింతన్ శిబిర్కు హాజరు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో చేపట్టిన కుల గణన దేశానికి దిక్సూచి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్లానింగ్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులతో కుల గణన పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ శాసన సభ , శాసన మండలి లో బిల్లు పాస్చేశామని, దీన్ని పార్లమెంట్ లో ఆమోదించడం ద్వారా సామాజిక న్యాయం, సాధికారత సాధ్యమవుతుందని అన్నారు.
కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ అధ్యక్షతన డెహ్రాడూన్ లో జరుగుతున్నచింతన్ శిబిర్ కార్యక్రమంలో బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను వివరించారు. కుల గణన సర్వే లో రాష్ట్రంలో బీసీ లు 56 శాతం ఉన్నట్లు తేలిందని చెప్పారు. అందుకు అనుగుణంగా బీసీలకు లోకల్ బాడీలతోపాటు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో బిల్లు పాస్చేశామని, దానిని కేంద్రం పార్లమెంట్లో ఆమోదించి, తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ లను స్థాపిస్తున్నామని, విద్యకు ప్రజా పాలన ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని వెల్లడించారు. 16 నెలల కాలంలో 69 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్టు చెప్పారు.
దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ: సీతక్క
అభాగ్యుల అభ్యున్నతిలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా నిలుస్తున్నదని మహిళ, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. సామాజిక న్యాయ సాధన దిశలోనే ప్రజా ప్రభుత్వం ప్రతి పైసా ఖర్చు చేస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి, అమలవుతున్న పథకాలను చింతన్ శిబిర్‌లో మంత్రి సీతక్క వివరించారు. ఆయా వర్గాల సంక్షేమం కోసం కేంద్ర సహకారం అందించాలని కోరారు.
సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాల్లో అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే సామాజిక న్యాయమని, ఆ దిశలో రెండు కీలక బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీకవంగా ఆమోద ముద్ర వేసిందని తెలిపారు. బీసీ వర్గాలకు జనాభా ప్రాతిపదికన విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లను 42 శాతం వరకు పెంచడంతో పాటు 30 ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించినట్లు వెల్లడించారు.
సంపన్నులు తినే సన్న బియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కోట్ల మంది ప్రజలకు అందిస్తున్నట్టు తెలిపారు. దేశంలోనే పేదలకు సన్న బియ్యం అందించే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నదని చెప్పారు. దివ్యాంగులు ఆత్మ గౌరవంతో బతికేలా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు.