- ఒక్కో బిల్డింగ్‌కు రూ.1.50 కోట్ల చొప్పున కేటాయింపు
- పంచాయతీరాజ్ భవన సముదాయాలకు రూ.15.75 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తూ పల్లెల అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో పంచాయతీరాజ్ శాఖ భవనాల నిర్మాణానికి రూ.15.75 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 6 మండల పరిషత్ కార్యాలయాలకు రూ.9 కోట్లు, మిగిలిన రూ.6.75 కోట్లు ఇతర భవన సముదాయాల కోసం కేటాయించనున్నది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 223 కొత్త పంచాయతీల భవనాల నిర్మాణాలకు పరిపాలనా అనుమతులు లభించాయి. అయితే, ఎన్ఆర్ ఈజీఎస్, స్టేట్ ఫైనాన్స్ నిధులతో కొత్త పంచాయతీ భవనాల నిర్మాణాలు చేపట్టనున్నారు.
9 కోట్లతో ఆరు మండల ఆఫీసులు..
రాష్ట్రంలోని పంచాయతీరాజ్‌శాఖ భవన సముదాయాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.15.75 కోట్లు మంజూరు చేసింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల పరిషత్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.1.50 కోట్లు, జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం వేలేరుకు రూ.1.50 కోట్లు, మహబూబాబాద్ జిల్లా గంగారంలో మండల కార్యాలయ భవన సముదాయానికి రూ.1.50 కోట్లు, మంగపేట, వాజేడు, కన్నాయిగూడెం మండల కార్యాలయాల కోసం ఒక్కొక్క భవనానికి రూ.1.50 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేసింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పీఆర్ సర్కిల్ కార్యాలయం వద్ద గోదాం నిర్మాణానికి రూ.25 లక్షలు, యాదగిరిగుట్ట జిల్లా మోత్కురులో గెస్ట్ హౌస్ నిర్మాణానికి రూ.20 లక్షలు, ఉప్పల్ లో ఎస్ఈ కార్యాలయ నిర్మాణానికి రూ.2 కోట్లు, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో డివిజనల్ కార్యాలయ భవన సముదాయ నిర్మాణానికి రూ.60 లక్షలు, ములుగు జిల్లా గోవిందరావుపేట, వెంకటాపురంలో సబ్ డివిజన్ కార్యాలయ సముదాయ నిర్మాణానికి రూ.1.20 కోట్లు, ములుగు ఎస్ఈ కార్యాలయ భవనానికి రూ.2.50 కోట్లు మంజూరు చేసింది. ఈ భవన నిర్మాణాలను వెంటనే చేట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
కొత్త పంచాయతీల భవనాలకు పరిపాలనా అనుమతులు
రాష్ట్ర వ్యాప్తంగా 223 పంచాయతీలకు కొత్త కార్యాలయాల భవనాల కోసం పాలనాపరమైన అనుమతులు లభించాయి. ఎన్ఆర్ ఈజీఎస్, స్టేట్ ఫైనాన్స్ నిధులతో ఈ భవన నిర్మాణాలు చేపట్టనున్నారు. ప్రభుత్వం ఒక్కొక్క పంచాయతీ భవనానికి రూ.20 లక్షలు కేటాయిస్తున్నది. ఇవి మార్చిలో గ్రౌండింగ్ అవుతాయి. రాష్ట్రంలో అన్ని పంచాయతీ భవనాలను ఒకే డిజైన్ లో నిర్మించేలా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ కసరత్తు చేస్తున్నది. కాగా, ఇప్పటికే ‘పనుల జాతర’ కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లో పంచాయతీ భవనాలకు శంకుస్థాపన చేశారు. జిల్లాల వారీగా మంజూరైన పంచాయతీ భవనాల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ జిల్లాకు 5, భద్రాద్రికి 5, హనుమకొండకు 3, జగిత్యాలకు 2, జనగామకు 2, జయశంకర్ భూపాలపల్లికి 7, కామారెడ్డికి 9, కరీంనగర్ కు10, ఆసిఫాబాద్ కొమ్రంభీం జిల్లాకు 1, మహుబూబాబాద్ కు29, మహుబూబ్‌నగర్ కు1, మెదక్ కు26, మేడ్చల్ మల్కాజిగిరికి 1, నాగర్ కర్నూల్ కు3, నల్గొండకు 24, నిర్మల్ కు 4, నిజామాబాద్ కు15, పెద్దపల్లికి 2, రాజన్న సిరిసిల్లకు 5, రంగారెడ్డికి 2, సంగారెడ్డికి 12, సిద్దిపేటకు 15, సూర్యాపేటకు 11, వికారాబాద్ కు18, వనపర్తికి 7, వరంగల్ కు2, యాదగిరిగుట్ట జిల్లాలో 7 పంచాయతీల్లో కార్యాలయాల నిర్మాణానికి అనుమతులు వచ్చాయి.