- క్యూబిక్ మీటర్ రూ.162.56 చొప్పున అమ్మేందుకు నిర్ణయం
- 3 బ్లాకులుగా 5,85,000 క్యూబిక్ మీటర్లు తవ్వుకోవాలి
వరంగల్, వెలుగు: ఓరుగల్లు భద్రకాళీ ఆలయ చెరువు మట్టికి ఇరిగేషన్ అధికారులు రూ.9 కోట్ల 50 లక్షల 98 వేల విలువ కట్టారు. క్యూబిక్ మీటర్‍కు ధర రూ.162.56 చొప్పున విక్రయానికి రెడీ అయ్యారు. 3 బ్లాకులుగా 5,85,000 క్యూబిక్ మీటర్లు తవ్వుకునేందుకు టెండర్లు పిలిచారు. టెండర్ల స్వీకరణకు ఈ నెల 11 నుంచి పది రోజుల గడువిచ్చారు. గడువులోగా టెండర్లు రాకపోవడంతో స్టీరింగ్ కమిటీలో చర్చించి మరోమారు షార్ట్ టైం టెండర్ పిలవాలని నిర్ణయించారు.
50 ఏండ్ల తర్వాత పూడికతీత
ఓరుగల్లు సిటీ మధ్యలో దాదాపు 382 ఎకరాల్లో విస్తరించి ఉన్న భద్రకాళి చెరువులో 50 ఏండ్ల తర్వాత పూడికతీత ప్రకియ చేపట్టారు. నవంబర్ తొలి వారంలో జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్లతో వరంగల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాడవీధుల బ్రిడ్జి నిర్మాణ పనులకు చెరువులోని నీటిని మళ్లింపు కొంత సమస్యగా భావించారు. పలువురితో చర్చించి భద్రకాళి చెరువు మొత్తం పూడికతీత పనులు చేపట్టాలని ఆదేశించారు.
దీంతో గతేడాది నవంబర్8న నీటిని వదిలే పనిమొదలుపెట్టినా, మత్స్యకారులు గడువు కోరడంతో రెండు రోజుల తర్వాత నుంచి పూర్తిస్థాయిలో నీటిని బయటకు వదిలారు. 10 నుంచి 12 రోజుల్లో నీరు ఖాళీ అవడంతో రాళ్లు, బండలు తేలాయి. బురద ఆరాక పనులు మొదలు పెడ్తమని చెప్పగా, పనులకు కావాల్సిన చర్యల కోసం దాదాపు రెండు నెలలుగా భద్రకాళి చెరువు ఖాళీగా ఉంచారు.
టార్గెట్ జూన్..
ఉమ్మడి వరంగల్జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పటికప్పుడు చెరువు పూడికతీత పనుల ప్రొగ్రెస్ తెలుసుకుంటున్నారు. కాగా, అధికారులు భద్రకాళి చెరువులో మట్టి పూడికతీత, తరలింపును సమావేశంలో చర్చించారు. ఈ క్రమంలో పొంగులేటితోపాటు జిల్లా మంత్రులు, గ్రేటర్ ఎమ్మెల్యేలు వచ్చే జూన్ వానకాలం నాటికి పూడికతీత పూర్తిచేసి వరదనీటితో తిరిగి చెరువు నింపాలని ఆదేశించారు. దీంతో ఇరిగేషన్ శాఖ పనుల నిర్వహణ కాంట్రాక్ట్ కోసం టెండర్లను ఆహ్వానించింది.
బ్లాక్1, 2, 3 వారీగా మట్టి విక్రయం, రవాణా చేయడానికి ఒక్కో క్యూబిక్ మీటర్ రూ.162.56 చొప్పున 5,85,000 క్యూబిక్ మీటర్లకు రూ.9 కోట్ల 50 లక్షల 98 వేల అంచనా వ్యయంతో టెండర్లను ఆహ్వానించింది. మంగళవారం సాయంత్రం వీటిని ఓపెన్ చేసే సమయానికి ఎవరూ ముందుకురాలేదు. ఓ వైపు జూన్ నెల డెడ్‍లైన్ ఉండటంతో స్టీరింగ్ కమిటీ నేడోరేపో సమావేశమై షార్ట్ టైం టెండర్ పిలవడమో లేదా ప్రత్యామ్నాయం ఆలోచన చేయాలని భావిస్తున్నారు.
మట్టి ఏంచేయాలనే చర్చ..
నిన్నమొన్నటి వరకు వరద నీటితో కళకళలాడిన భద్రకాళి చెరువుకు పూర్వవైభవం తెచ్చే క్రమంలో నీటిని ఖాళీ చేయడంతో రాళ్లు, బండలు దర్శనమిస్తున్నాయి. దాదాపు 382 ఎకరాల్లో ఉన్న చెరువులోని మట్టిని ఏంచేయాలనేదానిపై అధికారులు మల్లగుల్లలు పడ్డారు. నల్ల మట్టి రైతుల సాగుకు అనుకూలంగా ఉండటానికితోడు ఇటు బట్టీల నిర్వహణకు ఎంతో ఉపయోగపడుతుందని భావించారు. అలా ఎవరూ ముందుకురాని పక్షంలో గతంలో కాకతీయ కెనాల్వంటి ప్రాజెక్టుల కోసం సర్కారు భూములను పెద్ద ఎత్తున తవ్విన క్రమంలో ఈ మట్టితో వాటిని పూడ్చి భవిష్యత్ అవసరాల కోసం భూములను వాడుకోవాలనే ఆలోచన చేశారు. మొత్తంగా ప్రైవేటు వ్యక్తులకు మట్టిని విక్రయించాలని టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 0