అర్హులందరికీ రేషన్ కార్డులు : మంత్రులు పొంగులేటి, తుమ్మల, ఉత్తమ్

  • గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తులు తీస్కుంటం: మంత్రులు పొంగులేటి, తుమ్మల, ఉత్తమ్
  • ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలు 
  • పంచాయతీలకు పంపింది తుది జాబితా కాదు..
  • పేర్లు రానోళ్లు ఎవరూ ఆందోళన చెందొద్దు
  • రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ.. 
  • అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకూ అందిస్తం
  • మహిళల బ్యాంకు ఖాతాల్లోనే  ఆత్మీయ భరోసా సాయం 
  • ఈ నెల 26 నుంచి 4  స్కీమ్స్​ అమలు చేస్తామని వెల్లడి
  • జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్​

హైదరాబాద్, వెలుగు: అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతర ప్రక్రియ అని, చివరి లబ్ధిదారుల వరకు అందిస్తామని ప్రకటించింది. ఇందులో ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రులు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్​రావు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, గ్రామ సభల నిర్వహణ తదితర అంశాలపై శనివారం సెక్రటేరియెట్​ నుంచి  జిల్లా కలెక్టర్లతో ముగ్గురు మంత్రులు, సీఎస్​ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులను స్వీకరించడంతోపాటు ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్స్​ను కూడా పరిశీలించాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.  ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితా కులగణన సర్వే ఆధారంగా తయారు చేసిందని, ఇది తుది జాబితా కాదని తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26వ తేదీ నుంచి ప్రతిష్టాత్మకంగా 4  సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నదని చెప్పారు.

 రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను కొందరు ప్రతిపక్ష నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈ ట్రాప్ లో అధికారులు పడకూడదని సూచించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం గతంలో ఎవరైనా అప్లై చేసుకోని వాళ్లు ఉంటే.. వారినుంచి దరఖాస్తులను స్వీకరించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా కూడా కొత్త రేషన్ కార్డులకు లేదా కొత్త సభ్యుల చేర్పుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే  గతంలో జరిగిన ప్రజాపాలన సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తుల జాబితాలో అర్హులైన వారిని గుర్తించే ప్రక్రియ పురోగతిలో ఉందని తెలిపారు.  

అన్ని పరిశీలించాకే తుది జాబితా

ఈ నెల 26న  ప్రారంభించే 4 పథకాలపై 21వ తేదీ నుంచి  గ్రామసభల్లో  ప్రజా అభిప్రాయలు,  ఫీడ్ బ్యాక్ లు తీసుకోవాలని కలెక్టర్లకు మంత్రులు సూచించారు.  ప్రజా పాలన సేవా కేంద్రాల్లో కొత్తగా తీసుకున్న దరఖాస్తులు, ఎంపీడీవో  కార్యాలయంలో ఇప్పటికే ఉన్న అప్లికేషన్స్​ను తగిన రితీలో పరిశీలించిన తర్వాత మాత్రమే అర్హులైన లబ్ధిదారుల తుది జాబితాను ప్రకటించాలని స్పష్టం చేశారు. 

ALSO READ : రేషన్ కార్డులపై గుడ్ న్యూస్.. లిస్ట్‎లో పేరు లేనివాళ్లు మళ్లీ అప్లై చేసుకోవచ్చు

 అర్హులతోకూడిన తుది జాబితాలను ప్రకటించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తుందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంటి స్థలం ఉన్న వారి జాబితాతోపాటు ఇంటి స్థలం లేని వారి  లిస్ట్​ను గ్రామ సభల్లో ప్రదర్శించాలని, అలాగే కొత్తగా గ్రామ సభల్లో వచ్చే దరఖాస్తులను కూడా పరిశీలించాలని ఆదేశించారు.

ఆ గ్రామాల్లోని వ్యవసాయ కూలీలకూ ఆత్మీయ భరోసా

వ్యవసాయయోగ్యమైన ప్రతీ భూమికి రైతు భరోసా సాయం అందజేస్తామని మంత్రులు తెలిపారు. గతంలో వివిధ ప్రాజెక్టులకు, రహదారులకు, ఇతర ప్రభుత్వ అవసరాలకు ప్రభుత్వం సేకరించిన భూముల వివరాలు తహసీల్దార్ల వద్ద ఉన్నాయని చెప్పారు. వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా రైతు భరోసా లబ్ధిదారులను గుర్తించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజులపాటు కూలి పనికి వెళ్లిన వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తింపజేస్తామని చెప్పారు.

ప్రతీ కుటుంబంలో మహిళల బ్యాంకు ఖాతాలకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొత్తాన్ని బదిలీ చేస్తామని స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రంలో 156 గ్రామాలను మున్సిపాలిటీల్లో కలిపామని, ఈ గ్రామాల్లో 2023–24 లో జరిగిన ఉపాధి హామీ పనుల జాబితాను పరిగణనలోకి తీసుకోనున్నట్టు చెప్పారు.  ఆ గ్రామాల్లోని వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా కల్పిస్తామని తెలిపారు.