ఎక్స్ టెన్షన్ ఇవ్వకున్నా.. డ్యూటీలకు వస్తున్రు

ఎక్స్ టెన్షన్ ఇవ్వకున్నా.. డ్యూటీలకు వస్తున్రు
  • పలువురు రిటైర్డ్ అధికారుల నిర్వాకం
  • సర్కారు పొడిగిస్తుందని ధీమా
  • సీఎం విదేశీ టూర్ తో ఉత్తర్వులు ఆలస్యం  
  • స్కీమ్ ల అమలు కోసమే వస్తున్నారంటున్న ఆఫీసర్లు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విధుల్లో నుంచి తొలగించినా కొందరు రిటైర్డ్ అధికారులు తమకు ఎక్స్ టెన్షన్ ఇస్తారన్న ధీమాతో విధులకు అటెండ్ అవుతున్నారు. అన్ని శాఖల్లో రిటైర్ అయి విధుల్లో కొనసాగుతున్న అధికారులను తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి గత నెల 27న ఆదేశించారు. దీంతో అలాంటి రిటైర్డ్ అధికారుల లిస్ట్ జత చేస్తూ అన్ని ప్రభుత్వ శాఖలు జీవోలు జారీ చేశాయి. అన్ని శాఖల్లో కలిపి ప్రభుత్వం సుమారు 1,100 మందిని విధుల్లో నుంచి తొలగించింది. 

ఇందులో ఎక్స్ టెన్షన్ ఇచ్చే వారి సంఖ్య వంద కూడ దాటకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. కీలక పోస్టుల్లో కొనసాగుతున్న వారిని, స్కీమ్ ల అమలులో అనుభవం ఉన్న కొంత మంది అధికారులను మాత్రమే ఎక్స్ టెన్షన్ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా మెట్రో రైల్ ఎండీ ఎన్ వీఎస్ రెడ్డి, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఈఎన్సీ కనకరత్నం, స్ర్తీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డిని తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఆయా శాఖలు ఉత్తర్వులు జారీ చేశాయి. 

సీఎం విదేశీ టూర్ తో ఉత్తర్వులు లేట్

ప్రభుత్వ శాఖల్లో రిటైర్ అయిన వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు సీఎంవోకు లేఖలు ఇచ్చినట్లు సమాచారం. అయితే సీఎం విదేశీ పర్యటనతో వీరి కొనసాగింపుపై ఉత్తర్వులు ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. మరి కొన్ని శాఖల్లో పలనా అధికారులను తీసుకోవాలని ఇంకా ప్రపోజల్ కూడా పెట్టలేదని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అయినా రిటైర్డ్ ఆఫీసర్లు గత కొద్ది రోజుల నుంచి డ్యూటీలకు వస్తుండటం, అధికారిక రివ్యూలు, కార్యక్రమాల్లో పాల్గొంటుండటంపై ఆయా శాఖల ఉద్యోగులు మండిపడుతున్నారు. 

ఎక్స్ టెన్షన్ ఉత్తర్వులు ఇవ్వకుండా డ్యూటీలకు ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం ప్రభుత్వ స్కీమ్ ల అమలు ఉన్నందున డ్యూటీలకు అటెండ్ అవుతున్నారని, త్వరలో ఉత్తర్వులు వస్తాయని చెబుతున్నారు. గత 10 ఏళ్ల నుంచి రిటైర్డ్ ఆఫీసర్లు విధుల్లో కొనసాగుతుండటం వల్ల వారి కింద ఉన్న వందల మంది అధికారులు, ఉద్యోగులు ప్రమోషన్లు రాకుండానే రిటైర్ అయ్యారు. ఈ ఏడాది అన్ని శాఖల్లో అధికారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున బదిలీ అవుతున్నారు. కానీ రిటైర్ అయినవారిని మళ్లీ కొనసాగించటం వల్ల ప్రమోషన్లు రావని పలు శాఖల్లో చర్చ సాగుతోంది.