
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్ నగర్, వెలుగు : రాష్ట్రంలోని నిరుపేదకు కడుపు నిండా అన్నం పెట్టేందుకే సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, ఈనెల 30న హుజూర్ నగర్ లో ఈ పథకాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం హుజూర్ నగర్ లో ఐజీ సత్యనారాయణ, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలిసి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మొదటిసారిగా తెలంగాణలో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దేశ చరిత్రలో ఇంతకంటే మంచి పథకం మరోటి లేదన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 84 శాతం మందికి లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన పేదవారికి సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. ఈనెల 30 జరిగే బహిరంగ సభకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, అడిషనల్ కలెక్టర్ రాంబాబు, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.