అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు : ఉత్తమ్, తుమ్మల

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు : ఉత్తమ్, తుమ్మల
  • మంత్రులు ఉత్తమ్, తుమ్మల

కోదాడ, వెలుగు : ఈనెల 26న ప్రారంభించే నాలుగు సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అర్హులందరికీ అందజేస్తామని ఇరిగేషన్, సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. గురువారం కోదాడ పట్టణంలో ఎమ్మెల్యే పద్మావతి అధ్యక్షతన జరిగిన మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అర్హులందరికీ తెల్లరేషన్ కార్డులు ఇస్తామన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీతో 40 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో 72 శాతానికి ఆహార భద్రత కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రేషన్ కార్డుల మంజూరుపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని సూచించారు. 

రేషన్ కార్డుల జారీ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని, అర్హులందరికీ ఇస్తామన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని వివరించారు. పాలేరుతోపాటు కోదాడ నియోజకవర్గంలోని మోతే మండలానికి గోదావరి జలాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. కోదాడ బస్ డిపో పునరుద్ధరణకు రూ.18 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. 

కోదాడ పట్టణానికి రైలు మార్గం తెచ్చేందుకు రూట్ మ్యాప్ రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్​నాయకులు ప్రజా సంక్షేమ కోసం నిరంతరం కృషి చేస్తుంటే.. బీఆర్ఎస్ నాయకులు అధికారం కోసం ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. అంతకుముందు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా తిరుపతమ్మ, వైస్ చైర్మన్ గా షేక్ బషీర్, డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చందర్ రావు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ జబార్, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.