
- డ్రగ్స్, ఫుడ్ సేఫ్టీ, మెడికల్ ఎడ్యుకేషన్ విభాగాలపై గత సర్కార్ నిర్లక్ష్యం
- హెల్త్, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రీ బడ్జెట్ మీటింగ్లో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి దామోదర
హైదరాబాద్, వెలుగు: పేద, మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా ఆధారపడే వైద్య ఆరోగ్య శాఖకు నిధుల కేటాయింపులో అధిక ప్రాధాన్యమిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీపై ప్రీ బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు పలు సూచనలు చేశారు.
దశాబ్దకాలంగా డ్రగ్స్, ఫుడ్ సేఫ్టీ, మెడికల్ ఎడ్యుకేషన్ విభాగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. ప్రజా ప్రభుత్వం లో ఈ మూడు విభాగాలకు అధిక ప్రాధాన్యమిచ్చి రాబోయే రోజుల్లో బలోపేతం చేస్తామని తెలిపారు. డ్రగ్స్, ఫుడ్ సేఫ్టీ విభాగాలను ఆధునికీకరిస్తామని చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీకి రాబోయే బడ్జెట్లో సమృద్ధిగా నిధులు కేటాయించి, పేద, మధ్యతరగతి వర్గాలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.
వచ్చే ఏడాదికాలంలో రాష్ట్రంలో వైద్య కళాశాల భవనాలు, ఆసుపత్రుల నిర్మాణపనులు పూర్తవుతాయని మంత్రులు వివరించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను పెద్ద సంఖ్యలో వినియోగించుకునేందుకు అధికారులు కృషి చేయాలని మంత్రులు ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లానిటోరియాలను నిర్మించే ఆలోచన ఉన్నట్టు మంత్రులు వెల్లడించారు.
ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తు, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ హరిత తదితరులు పాల్గొన్నారు.