ప్రాజెక్టుల భద్రతకు డెసిషన్ సపోర్ట్ సిస్టమ్!

ప్రాజెక్టుల భద్రతకు డెసిషన్ సపోర్ట్ సిస్టమ్!
  • వరదను అంచనా వేసేలా చర్యలు
  • గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల వద్ద ఏర్పాటు చేయాలన్న యోచనలో ఇరిగేషన్​ శాఖ

హైదరాబాద్, వెలుగు: గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రధాన ప్రాజెక్టుల వద్ద ‘డెసిషన్ సపోర్ట్ సిస్టమ్’​ను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నది. ఈ వ్యవస్థ సెట్ చేస్తే ఎప్పటికప్పుడు నదిలో వరద ప్రవాహం, ప్రాజెక్టుల పరిస్థితిని తెలుసుకునేందుకు వీలవుతుందని భావిస్తున్నట్టు తెలిసింది.

దీనికి సంబంధించి ఇప్పటికే ఓ ప్రైవేటు సంస్థ ద్వారా వీడియో కాన్ఫరెన్స్​లో డెమో కూడా తీసుకున్నట్టు సమాచారం. ముందుగా గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టుల వద్ద ఏర్పాటు చేసి దాని పనితీరు గురించి తెలుసుకోవాలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తున్నది.

డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటి?

డెసిషన్​ సపోర్ట్ సిస్టమ్ ఓ కంప్యూటర్ ఆధారిత వ్యవస్థ. ప్రాజెక్టుల వద్ద దీని కోసం ఓ పెద్ద నెట్ వర్క్ నే ఏర్పాటు చేస్తారు. వాతావరణం ఎలా ఉందో తెలుసుకునేందుకు వెదర్ స్టేషన్, వాటర్ లెవెల్స్​ను ఎప్పటికప్పుడు తెలుసుకునే వ్యవస్థ, అలల తీవ్రత, వస్తున్న వరద, ఆ వరదతో ప్రాజెక్టుల మీద పడుతున్న ఒత్తిడి, భూమిలో పరిస్థితులు (సీస్మిక్ అసెస్మెంట్) సహా ప్రతి విషయాన్నీ ఈ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అంచనా వేస్తుంది. దాని ప్రకారం.. ఎప్పుడు ఏం చేయాలో ప్రతి చిన్న డేటానూ వాటికి అనుసంధానించిన కంప్యూటర్ వ్యవస్థకు పంపిస్తుంది. 

ఈ డేటా ఆధారంగా డ్యామ్ లేదా బ్యారేజీ గేట్ల ఆపరేషన్​ను నిర్వహిస్తారు. వస్తున్న వరద వల్ల డ్యామ్ లేదా బ్యారేజీలకు ముప్పు ఉన్నట్టు తెలిస్తే ఈ సిస్టమ్ వెంటనే అలర్ట్​ చేస్తుంది. దానికి అనుగుణంగా అధికారులు సరైన సమయంలో చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది.