పామాయిల్​ ఫ్యాక్టరీపై చిగురిస్తున్న ఆశలు

పామాయిల్​ ఫ్యాక్టరీపై  చిగురిస్తున్న ఆశలు
  • డీపీఆర్​ రెడీ చేస్తున్న  ఆఫీసర్లు 
  • లేటెస్ట్ ​మిషనరీ ఏర్పాటు చేసే చాన్స్ 
  •  ఏడాదిలో ప్రారంభించాలని టార్గెట్​
  • ఏటా పెరుగుతున్న ఆయిల్​ పామ్​ సాగు 

గద్వాల, వెలుగు : జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి దగ్గర గతంలో మూతపడిన ఆయిల్ మిల్ స్థానంలో పామాయిల్​ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని  ప్రభుత్వం నిర్ణయించింది.  ఇందుకు సంబంధించి అధికారులు డీపీఆర్​  రెడీ చేస్తున్నారు. ఆయిల్​ ఫెడ్ ఆధ్వర్యంలో లేటెస్ట్​  టెక్నాలజీ మిషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 

వచ్చే ఏడాదిలోగా ప్రొడక్షన్​ ప్రారంభించాలన్న  టార్గెట్​తో అధికారులు కసరత్తు  చేస్తున్నారు.  అందులో భాగంగా   ఆయిల్ ఫెడ్ ఎండీ, హార్టికల్చర్​  డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఇటీవల పాత మిల్లును,  ఆయిల్ పామ్ నర్సరీని పరిశీలించారు. దీంతో జిల్లాకు చెందిన వారితో  పాటు చుట్టుపక్కల రైతులు కూడా ఆయిల్​ పామ్​ సాగువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.  

 ఏడాదిలో ఫ్యాక్టరీ ఏర్పాటు 

బీచుపల్లిలో గంటకు 30 టన్నుల గెలల క్రషింగ్​ సామర్థ్యంతో  ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నారు. ఫ్యాక్టరీ రెండు షిఫ్ట్​లలో పని చేయాలంటే   పదివేల ఆయిల్ పామ్​ దిగుబడి రావాల్సిఉంటుంది.    గద్వాల జిల్లాలో ప్రస్తుతం 6,742 ఎకరాల ఆయిల్ పామ్ తోటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో  ఏటా ఆయిల్​పామ్​ సాగు పెరుగుతోంది. 

2020–21లో పైలెట్​ ప్రాజెక్టుగా 250 ఎకరాల్లో  ఆయిల్​పామ్ సాగు చేయాలని భావించగా ఆ ఏడాది  1,500 సాగయ్యింది.  2021-– -22 లో 2,862 ఎకరాలు, 2022-–- 23 లో 1,610 ఎకరాలు, ఈ ఏడాది  540 ఎకరాల్లో తోటలు వేశారని ఆఫీసర్లు చెబుతున్నారు. మొదట  సాగయిన 250 ఎకరాల్లో పంట ఇప్పుడు కోతకు వస్తుందని, ఈ గెలలను  ఆశ్వరావుపేటలో ఉన్న ఫ్యాక్టరీకి తొలుతారని చెప్పారు.   బీచుపల్లి ఫ్యాక్టరీ అందుబాటులోకి వచ్చేనాటికి గద్వాలతో పాటు ఈ ఫ్యాక్టరీ పరిధిలోకి వచ్చే  నారాయణపేట జిల్లాలోనూ  పామాయిల్​ తోటలను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది.   ​ 

మూతపడిన మిల్లులోనే కొత్త ఫ్యాక్టరీ 

ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది. రూ 193 ఉన్న ఒక మొక్కను రూ. 20కే ఇస్తున్నారు. మిగతా రూ. 173 సర్కారు సబ్సిడీగా ఇస్తోంది.  ఆయిల్​పామ్​ తోటల్లో అంతర పంటలు సాగు చేసుకునేందుకు  ఎకరానికి ఏడాదికి రూ 2,100 చొప్పున నాలుగేళ్ల పాటు ప్రోత్సాహాకాన్ని ఇస్తోంది. 12 ఎకరాల వరకు సబ్సిడీ  మీద డ్రిప్​ పరికరాలను ఇస్తోంది.   బై బ్యాక్ అగ్రిమెంట్ ఉండడంవల్ల రైతులకు మార్కెట్​ సమస్యలు ఉండవు.  బీచుపల్లిలో మూత పడిన విజయ ఆయిల్​మిల్లులోనే పామాయిల్​ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తారు.

పాత  మిల్ కు సంబంధించి బిల్డింగులు, గోదాములు, షెడ్లను  ఆఫీసర్లు పరిశీలించారు.  అందులో ఏవి  పనికొస్తాయో..  వేటిని కూల్చివేయాలో నిర్ణయించేందుకు  ఇటీవల  నిపుణుల బృందం తనిఖీ చేసింది. ఈ బృందం రిపోర్ట్​ ఆధారంగా సివిల్​ వర్క్స్​ కు సంబంధించిన  ప్రాజెక్ట్ రిపోర్ట్  అందజేయనున్నారు. సివిల్​ వర్క్స్​ వీలైనంత త్వరగా పూర్తి చేసి..  ఆ తర్వాత  మిషనరీ ఏర్పాటు చేస్తారు.