పకడ్బందీగా పథకాల అమలు.. అధికారులకు మంత్రి సీతక్క దిశానిర్దేశం

  • అర్హులకే పథకాలు అందేలా చూడాలని సూచన
  • సమస్యలపై గళమెత్తిన ఎమ్మెల్యేలు
  • ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సుదీర్ఘ సమావేశం

నిర్మల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 నుంచి ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయబోతున్న నాలుగు సంక్షేమ పథకాలపై రాష్ట్ర పంచాయతీరాజ్, జిల్లా ఇన్​చార్జి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్​ కలెక్టరేట్​లో చేపట్టిన సమీక్ష సమావేశం హాట్​హాట్​గా సాగింది. ఉమ్మడి ఆదిలాబాద్​లోని నాలుగు జిల్లాలకు చెందిన కలెక్టర్లు, పలువురు ఎమ్మెల్యేలు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందించనున్న నాలుగు సంక్షేమ పథకాల అమలుపై ఉమ్మడి జిల్లా స్థాయి ప్రణాళిక కార్యాచరణ సమావేశంలో కలెక్ట ర్లకు, సంబంధిత అధికారులకు సీతక్క దిశానిర్దేశం చేశారు.

కార్యాచరణ సిద్ధం చేయండి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన రేషన్ కార్డులు, ఇం దిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాల అమలుపై మొదట ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు అభిలాష అభినవ్, రాజర్షి షా, కుమార్ దీపక్, వెంకటేశ్ ధోత్రే, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వెడ్మ బొజ్జు పటేల్, రామారావు పటేల్, పాయల శంకర్, అనిల్​జాదవ్ అభిప్రాయాలను మంత్రి సీతక్క తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని, అర్హులకే అందేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. 

Also Read :- ఈ – ఫార్ములా కారు రేసులో కేటీఆర్​ది క్విడ్​ ప్రో కోనే..

జనవరి 26 నుంచి ప్రారంభించనున్న పథకాలను రెవెన్యూ, పంచాయతీ రాజ్, వ్యవసాయ, సంబందిత శాఖల అధికారులంతా సమన్వయంతో పనిచేసి అర్హులైన పేద లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. గ్రామాల్లో గ్రామ సభలు, పట్టణాల్లో వార్డు సభలు నిర్వహించి గుర్తించిన అర్హుల వివరాలను బహిరంగంగా వెల్లడించాలన్నారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టర్లను కలెక్టర్లు, అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ విఠల్, ఎమ్మెల్యేలు ప్రస్తావించిన సమస్యలపై మంత్రి స్పందించారు. వాటిని ముఖ్యమంత్రికి వివరించి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.  

మందమర్రిపై దృష్టి పెట్టండి: ఎమ్మెల్సీ విఠల్

మందమర్రి మున్సిపాలిటీ నోటిఫైడ్ కావడంతో అక్కడ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇబ్బందికరంగా మారిందని, ఈ సమస్యను పరిష్కరించి మందమర్రి మున్సిపాలిటీ లోని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందేలా చూడాలని ఎమ్మెల్సీ విఠల్ కోరారు. 

డీఆర్​సీ మీటింగ్ ను ఏర్పాటు చేయండి: మహేశ్వర్ రెడ్డి

 జిల్లా అభివృద్ధికి కీలకమైన డీఆర్​సీ మీటింగ్​ను వెంటనే ఏర్పాటు చేయాలని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. దరఖాస్తులు చేసుకున్న అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. ప్రస్తుత జాబితాలో చాలామంది పేదల పేర్లు లేవని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

నాన్ ట్రైబల్స్ కు అన్యాయం జరగద్దు: వెడ్మ బొజ్జు

ఏజెన్సీ ఏరియాలోని నాన్ ట్రైబల్స్ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్​ కోరారు. ఏజెన్సీలో నివసించే నాన్ ట్రైబల్స్​కు 2014 ముందు వారి భూములకు సంబంధించి పహానీలు ఇచ్చేవారని, దీంతో వారు బ్యాంకు రుణాలు పొందే అవకాశం ఉండేదన్నారు. ధరణి కారణంగా వారు ఈ అవకాశం కోల్పోయారన్నారు. వారికి రైతుబంధు కూడా రావడం లేదన్నారు. ఏజెన్సీలో నివసించే గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేందుకు స్థలం ఉన్నప్పటికీ ఆ స్థలాలకు డాక్యుమెంట్ లేకపోవడం సమస్యగా మారిందన్నారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకుపోవాలని కోరారు.

డబుల్ బెడ్రూం ఇండ్లలో సౌకర్యాలు కల్పించాలి: రామారావు పటేల్ 

ముథోల్ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో కనీస సౌకర్యాలు లేవని ఎమ్మెల్యే రామారావు పటేల్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ అభిలాష అభినవ్ డబుల్ బెడ్రూం ఇండ్లలో వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, కొద్దిరోజుల్లో టెండర్లు నిర్వహించనున్నామని చెప్పారు.

 పట్టణ పేదలను పట్టించుకోండి: పాయల్ శంకర్

 గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ఆర్ఈజీఎస్ కింద నిరుపేద కూలీలను ఆత్మీయ భరోసా పథకం కింద ఎంపిక చేస్తున్నారని, కానీ పట్టణంలోని నిరుపేదలకు ఈ అవకాశం దక్కడం లేదన్నారు. పట్టణ ప్రాంతాల్లో నిరుపేదలను గుర్తించి వారికి ఆత్మీయ భరోసా పథకం వర్తింపజేయాలన్నారు. ఇందిరమ్మ పథకం కింద స్థలాలు లేని వారికి  స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు.

ఏఐ టెక్నాలజీతో లబ్ధిదారుల ఎంపిక: కలెక్టర్ రాజర్శి షా

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న నాలుగు పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్శి షా తెలిపారు. అరులైన వారిని ఎంపిక చేయడం, ఎంపిక ప్రక్రియలో పారదర్శకత ఉండేందుకు ఏఐ టెక్నాలజీని వినియోగిస్తామన్నారు. సమావేశంలో నిర్మల్​ఎస్పీ జానకి షర్మిల, అడిషనల్ కలెక్టర్లు, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా, మున్సిపల్ చైర్మన్లు గండ్రత్ ఈశ్వర్, మేడిపల్లి సత్యం, గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్ భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.