
- పోర్టల్ ద్వారా సిఫార్సు లేఖల జారీ
హైదరాబాద్, వెలుగు: తిరుమల దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలపై ప్రభుత్వం గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. లెటర్లు ఇచ్చేందుకు ప్రత్యేకంగా కంప్యూటర్ అప్లికేషన్ రూపోందించి, పోర్టల్ ను ప్రజా ప్రతినిధులకు అందుబాటులోకి తీసుకరానున్నట్టు సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం ఈ అంశంపై రాష్ర్ట ప్రజా ప్రతినిధులకు ఆయన లేఖ రాశారు. ఇప్పటి నుంచి ప్రజా ప్రతినిధులు ఇచ్చే లేఖలు https;//cmottd.telangana.gov.in ఈ పోర్టల్ ద్వారానే జారీ చేయాలని, ఇందులో నుంచి ఇచ్చే లేఖలకు బ్రేక్ దర్శనం, రూ. 300 దర్శనం తిరుమలలో అందుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ పోర్టల్ ద్వారా ఇవ్వని లేఖలను టీటీడీ అధికారులు అంగీకరించరని వెల్లడించారు. ప్రజా ప్రతినిధులు ఇచ్చే లేఖలను ఈ పోర్టల్ ద్వారా జారీ చేయడంతో పాటు సంతకం చేసి, స్కాన్ చేసి పోర్టల్ లో అప్ లోడ్ చేసిన తర్వాత భక్తుల సిఫార్సు లేఖలకు సంబంధించిన ఒరిజినల్ కాపీని ఇవ్వాలని ఆయన సూచించారు. పోర్టల్ ను ఓపెన్ చేసిన తరువాత టీటీడీ దర్శనం ఎంట్రీ డిటెయిల్స్, పబ్లిక్ రిప్రంజటేటివ్ రిక్వెస్ట్ లోకి వెళ్లి వివరాలు ఎంట్రీ చేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు ఇచ్చిన ఒరిజినల్ లెటర్ ను , ఆధార్ జిరాక్స్ తో పాటు తిరుమలలో అధికారులు సూచించిన కౌంటర్ లో అందచేయాలని శ్రీనివాసులు స్పష్టం చేశారు.