కృష్ణానది బోర్డుకు తెలంగాణ లేఖ

హైదరాబాద్: కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కు తెలంగాణ ప్రభుత్వం తరపున నీటిపారుదల శాఖ లేఖ రాసింది. విద్యుత్ ఉత్పత్తి వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుందన్న వాదన నిరాధారం అని స్పష్టం చేసింది. శ్రీశైలం డ్యాం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని ఆపాలంటూ ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం లేఖపై కృష్ణా బోర్డు స్పందించి తెలంగాణ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. 
కృష్ణా బోర్డు రాసిన లేఖకు స్పందనగా తెలంగాణ ప్రభుత్వం తరుపున ఈఎన్సీ మురళీధర్ బోర్డు చైర్మన్ కు మరో లేఖ రాసింది. శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టు అని.. ఈ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడే ప్లానింగ్ కమిషన్, కృష్నా ట్రిబ్యునల్ పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి అప్పట్లోనే అనుమతిచ్చిందని గుర్తు చేసింది.
ఏపీ ప్రభుత్వం 1991 నుంచి ఇప్పటి వరకు వేసవి తీవ్రంగా ఉండే ఏప్రిల్, మే నెలల్లో ఏ రోజు కూడా శ్రీశైలం డ్యాం నీటిమట్టం 834 అడుగులకు పైగా ఉండేలా నిర్వహించలేదని వివరించింది. ఇప్పుడు మాత్రం 854 అడుగులకు పైగా నీటిమట్టం కొనసాగించాలని కోరుతోందని.. కృష్ణా పరివాహక ప్రాంతంలో లేని ప్రాంతాలకు కృష్ణా జలాలను తరలించేందుకే ప్రభుత్వం ఈ వాదన చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. 
ఏపీ ప్రభుత్వం రెండేళ్లుగా వరుసగా 170 టీఎంసీలు, 124 టీఎంసీలు కృష్ణా పరివాహక ప్రాంతం వెలుపలి ప్రాంతాలకు అక్రమంగా తరలించిందని ఆరోపించింది. చెన్నై తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీలు కూడా ఇవ్వలేదని పేర్కొంది. అలాగే  పెన్నా నది సహా ఇతర నదుల పరివాహక ప్రాంతాల్లో 360 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని.. కాబట్టి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి వల్ల ఏపీకి నష్టమన్న వాదన నిరాధారమని తెలంగాణ స్పష్టం చేసింది.