
- రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరిగింది: మంత్రి ఉత్తమ్
- రైతులు, ఎగుమతిదారులకు ప్రోత్సాహకాలు ఇస్తాం
- లేటెస్ట్ టెక్నాలజీ రైలు మిల్లులపై శిక్షణ ఇవ్వాలని ఆదేశం
- అగ్రికల్చర్ వర్సిటీలో బియ్యం ఎగుమతి విధానంపై సెమినార్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరిగిందని, మిగులు బియ్యాన్ని ఎగుమతి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అవసరానికి మించి ధాన్యం పండిస్తున్నామని, ఏడాదికి 10 లక్షల టన్నుల దొడ్డు బియ్యం ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉందని తెలిపారు. పిలిఫిన్స్తో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. లేటెస్ట్ టెక్నాలజీ రైస్ మిల్లుల ఏర్పాటుపై అగ్రికల్చర్ యూనివర్సిటీలో రైతులు, యువతకు ట్రైనింగ్ ఇస్తామన్నారు. వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో బియ్యం ఎగుమతి విధానంపై మంగళవారం సెమినార్ నిర్వహించారు. ఈ సదస్సుకు మంత్రి ఉత్తమ్ చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో సాగయ్యే దొడ్డు రకాల్లో ఎంటీయూ 1010, ఐఆర్ 64 వెరైటీకి పిలిఫిన్స్లో ఎక్కువ డిమాండ్ ఉన్నది. నేరుగా వరి వేసే పద్ధతి (డీఎస్ఆర్), రోజు విడిచి రోజు నీరు అందించే విధానం (ఏడబ్ల్యుడీ), తక్కువ రసాయనాలు వాడి వరి సాగు చేసేలా రైతులను అగ్రికల్చర్ సైంటిస్టులు ప్రోత్సహించాలి. ఎక్స్పోర్ట్కు అనుకూలమైన వరి రకాలను సాగు చేసే రైతులు, ఎగుమతిదారులకు ప్రోత్సాహకాలు ఇస్తాం. ఈ యేడు వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. రెండు సీజన్లలో కలిపి రికార్డు స్థాయిలో 280 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది.
రైతుల కృషి, కొత్త వరి రకాలు, వాతావరణ పరిస్థితులు, ప్రకృతి సహకారంతోనే ఇది సాధ్యమైంది’’అని ఉత్తమ్ అన్నారు. పిలిఫిన్స్ ఎప్పుడూ బియ్యం దిగుమతి చేసుకునే దేశమని అగ్రికల్చర్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య అన్నారు. రాష్ట్రంలో పండించే బియ్యానికి అక్కడ అనుకూలమైన మార్కెట్ ఉందని తెలిపారు. వర్సిటీ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ బలరాం, రైస్ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ డాక్టర్ దామోదర్ రాజు, యూజీసీ ప్రొఫెసర్ ఆప్ ప్రాక్టీస్ డాక్టర్ సమరేందు మహంతి ఎగుమతులపై మాట్లాడారు. ఈ సెమినార్లో ఆల్ ఇండియా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణారావు, ఎఫ్‌సీఐ, అపెడా అధికారులు, రైతు సంఘాల నేతలు, వర్సిటీ సైంటిస్టులు, సివిల్ సప్లయ్స్ అధికారులు పాల్గొన్నారు.