ఎస్సీ గురుకులాల్లో కోడింగ్ కోర్సులు : అలుగు వర్షిణి

ఎస్సీ గురుకులాల్లో కోడింగ్ కోర్సులు : అలుగు వర్షిణి
  • ఈ అకడమిక్ ఇయర్ నుంచే అమలు
  • పదో తరగతి మినహాయించి 
  • ఆరు నుంచి  ఇంటర్ వరకు కోడింగ్ పై శిక్షణ 
  • గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ గురుకులాల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టూడెంట్లకు కోడింగ్ పై శిక్షణ ఇవ్వనున్నట్టు సెక్రటరీ అలుగు వర్షిణి చెప్పారు. పదో తరగతి విద్యార్థులను మాత్రం మినహాయిస్తున్నామని తెలిపారు. ఈ అకడమిక్ ఇయర్ నుంచే 238  గురుకుల  పాఠశాలల్లో కోడింగ్ కోర్సుపై శిక్షణ ఇవ్వనున్నట్టు మంగళవారం పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. గతేడాది కేవలం ఒక్క  మొయినాబాద్ పాఠశాలలో మాత్రమే కోడింగ్ పై శిక్షణ ఇవ్వగా ఇప్పుడు అన్ని స్కూళ్లలో అమలు చేయనున్నట్టు వివరించారు.

 శిక్షణ కోసం గురుకుల సంస్థ లండన్​కు చెందిన ఆర్పీఎఫ్ (ర్యాస్ప్ బెర్రీపై ఫౌండేషన్) తో ఐదేండ్లకు ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. ఇందులో భాగంగా విద్యార్థులకు కావాల్సిన నైపుణ్య శిక్షణ, కరిక్యులమ్ , యాక్షన్ ప్లాన్ (కార్యాచరణ ప్రణాళిక ) , మానిటరింగ్, టీచింగ్ వంటి అంశాల్లో ఫౌండేషన్ నిర్వహకులు పాలు పంచుకోనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, మెషీన్‌‌‌‌ లెర్నింగ్, రోబోటిక్స్, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ టూల్స్‌‌‌‌కు సంబంధించిన పాఠ్యాంశాల్ని వారికి బోధించేందుకు రంగం సిద్ధం చేశారు. గురుకుల సంస్థ కోడింగ్ ను పైలట్ ప్రాజెక్ట్ గా ప్రతి పాఠశాలలో  ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా అమలు చేసింది. దాని ఫలితాలు మెరుగ్గా ఉండటంతో   ఫౌండేషన్ ప్రతినిధులను  గురుకుల అధికారులు ఒప్పించారు. ఇందులో భాగంగా అన్ని పాఠశాలల్లో కంప్యూటింగ్ పాఠ్యాంశాలను రెగ్యులర్ సబ్జెక్టుగా కూడా ప్రవేశపెడుతున్నారు.  

1.52 లక్షల మంది విద్యార్థులకు బోధన

కోడింగ్ కోర్సులో భాగంగా విద్యార్థులకు రెండు గంటలపాటు తరగతులు బోధించడంతో పాటు, రెండు గంటలు ప్రాజెక్ట్ వర్క్ చేయిస్తారు. దాదాపు1.52 లక్షల మంది విద్యార్థులందరికీ కంప్యూటింగ్ పాఠ్యాంశాలను ఒక సబ్జెక్టుగా నేర్పించడంతో పాటు పరీక్ష నిర్వహిస్తారు. కోర్సును పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. పిల్లలకు కోడింగ్ సాంకేతిక  విద్యను అందించడం  గురుకుల చరిత్రలోనే  మొట్టమొదటిసారి అని, ఇది  మైలురాయిగా నిలవనుందని సెక్రటరీ ప్రకటించారు. కోడింగ్ శిక్షణ , బోధనకు  తగ్గట్టు పాఠశాలల్లో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ లను  అందుబాటులోకి తెస్తున్నట్టు సెక్రటరీ పేర్కొన్నారు.