
హైదరాబాద్, వెలుగు: సినిమా థియేటర్లలో ఎప్పుడు పడితే అప్పుడు షోలు వేయడం, 16 ఏండ్లలోపు పిల్లలను కూడా వేళాపాళా లేకుండా అనుమతించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ఉదయం11 గంటలలోపు, రాత్రి11 గంటల తరువాత16 ఏండ్లలోపు పిల్లలను సినిమాలకు అనుమతించరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘‘ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలి. అన్ని వర్గాలతో ప్రభుత్వం చర్చలు జరిపి చట్ట ప్రకారం నిర్ణయం తీసుకునేవరకు మైనర్లను ఆ వేళల్లో సిన్మాలకు అనుమతించరాదు” అని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరలను పెంపు, అదనపు షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను సోమవారం జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి విచారించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది విజయ్ గోపాల్ వాదిస్తూ, బెనిఫిట్ షోలకు అనుమతించరాదని ఈ నెల11న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. సినిమాటోగ్రఫీ రూల్స్ ప్రకారం ఉదయం 8.40 గంటలలోపు, తెల్లవారుజామున 1.30 గంటల తర్వాత సినిమాలను ప్రదర్శించరాదన్నారు.
మల్టీప్లెక్స్ లలో ఆఖరి షో తెల్లవారుజామున 1.30 గంటలకు ఉంటుందన్నారు. ఇలా అర్ధరాత్రి దాటాక సినిమాలకు వెళ్తే మైనర్ల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే పుష్ప–2 సినిమా ప్రదర్శన సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించిన విషయాన్ని గుర్తు చేశారు. వాదనలు విన్న తర్వాత.. ప్రతివాదులైన హోంశాఖ కార్యదర్శికి హైకోర్టు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది.