పట్టణాల్లోనూ రైతు కూలీలకు భరోసా ఇవ్వండి

పట్టణాల్లోనూ రైతు కూలీలకు భరోసా ఇవ్వండి
  • నెల రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి
  •  ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లోని రైతు కూలీలతో సమానంగా పట్టణాల్లోని రైతు కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలనే వినతిపత్రంపై 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గ్రామాల్లో భూమిలేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు చెల్లించేలా ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో పథకాన్ని రూపొందించింది. దీనిని గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకే వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని, పట్టణాలు, మున్సిపాలిటీల్లోని రైతు కూలీలకు అమలు చేయకపోవడం అన్యాయమని పేర్కొంటూ నారాయణపేట జిల్లాకు చెందిన రైతు గవినోళ్ల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌  వేసిన పిల్‌‌‌‌‌‌‌‌ను తాత్కాలిక చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌  సుజోయ్‌‌‌‌‌‌‌‌ పాల్, జస్టిస్‌‌‌‌‌‌‌‌  రేణుక యారా డివిజన్‌‌‌‌‌‌‌‌  బెంచ్‌‌‌‌‌‌‌‌ సోమవారం విచారించింది.

పిటిషనర్‌‌‌‌‌‌‌‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ వాదిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసిందని, ఫలితంగా మున్సిపాలిటీల్లో ఉండే రైతు కూలీలకు అన్యాయం జరుగుతోందన్నారు. మున్సిపాలిటీల్లోని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయకపోవడం వివక్ష కిందకు వస్తుందని చెప్పారు.

రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీల్లో 8 లక్షల మందికి పైగా కూలీలు ఉన్నారని వివరించారు. రైతు కూలీలందరినీ ఒకేలా చూసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న బెంచ్.. రైతు కూలీలకు ఈ పథకం అమలుపై నాలుగు వారాల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించి పిల్ పై విచారణను ముగించింది.