
- ఏఐ సాయంతో నకిలీ వీడియోలు సృష్టించి అసత్య ప్రచారం చేశారని కోర్టు దృష్టికి..
- సర్కారును అప్రతిష్ట పాలు చేసేలా ఫేక్ ఫొటోలు సృష్టించారన్న సర్కారు
- తీవ్రంగా పరిగణించాలని కోర్టుకు వినతి
- బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్
- ఈ పిటిషన్‌పై 24న వాదనలు వింటామన్న కోర్టు
హైదరాబాద్, వెలుగు: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల్లో చెట్ల నరికివేతకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారని తెలిపింది. సోషల్ మీడియా పోస్టుల నిలుపుదలకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. పోలీసులకు నోటీసులు ఇచ్చి వివరాలు తెప్పించుకోవాలని కోరింది.
దీనిపై స్పందించిన హైకోర్టు.. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున ఇప్పుడే పోలీసులకు నోటీసులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్‌ఐఐసీ)కి బదిలీ చేసి, చదును చేయడాన్ని వెంటనే ఆపాలని కోరుతూ కోర్టులో 4 పిల్స్ దాఖలయ్యాయి. వీటిపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. అటవీ శాఖ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనక గురుస్వామి వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలు చేసేలా కొందరు ఏఐ ద్వారా తప్పుడు ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారని చెప్పారు.
భూమిని చదును చేసే క్రమంలో బుల్డోజర్లను చూసి నెమళ్లు, జింకలు పారిపోతున్నట్టు నకిలీ వీడియోలు సృష్టించారని తెలిపారు. ఫేక్ వీడియోలు సృష్టించి.. ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేసిన వాళ్లపై చట్టప్రకారం చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇలాంటి వాటిని ప్రజలు నమ్మే ప్రమాదం ఉన్నందున తక్షణమే వాటిని సోషల్ మీడియా నుంచి తొలగించేలా ఆర్డర్స్ ఇవ్వాలని కోర్టును రిక్వెస్ట్ చేశారు.
సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నది..
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాదులు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎల్.రవిచందర్ వాదనలు వినిపించారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేస్తున్నదని తెలిపారు. తదుపరి విచారణను అత్యున్నత న్యాయస్థానం ఈ నెల 16కు వాయిదా వేసిందని చెప్పారు. ఒకే అంశంపై సుప్రీం కోర్టు, హైకోర్టు సమాంతరంగా విచారణ చేపట్టడం సబబు కాదని, విచారణను వాయిదా వేయాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే నాలుగు పిల్స్ దాఖలవ్వగా, సోమవారం ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కూడా ఓ వ్యాజ్యం దాఖలు చేశారు. వీటన్నింటిపై ఈ నెల 24న విచారణ చేపడ్తామని హైకోర్టు ప్రకటించింది.