వచ్చే ఏడాది నుంచి బీఎస్సీలో కొత్త సిలబస్

వచ్చే ఏడాది నుంచి బీఎస్సీలో కొత్త సిలబస్
  • విద్యర్థులకు ఉపాధి కల్పించేలా పాఠ్యాంశాల రూపకల్పన 
  • సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ సమావేశంలో ఉన్నత విద్యా మండలి నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని వర్సిటీల పరిధిలో ఉన్న డిగ్రీ బీఎస్సీ (సైన్స్) సిలబస్ ను మారుస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు పురుషోత్తం, మహమూద్  తెలిపారు. ప్రస్తుత ధోరణికి అనుగుణంగా సిలబస్ ను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. శనివారం హయ్యర్  ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో సబ్జెక్ట్ ఎక్స్ పర్టులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

విద్యార్థుల్లో స్కిల్స్  పెరిగేలా, ఇతరులకు ఉపాధి కల్పించేలా సిలబస్ ను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని, అందుకు అనుగుణంగా సిలబస్ ను రూపొందిస్తున్నామని పురుషోత్తం, మహమూద్ చెప్పారు. క్రెడిట్స్  విధానంలోనూ మార్పులు చేశామని తెలిపారు. 

గతంలో సెమినార్లకు రెండు క్రెడిట్లు ఇస్తుండగా దాన్ని ఒక్క క్రెడిట్ కు పరిమితం చేశామని వెల్లడించారు. ప్రాజెక్ట్, ఇంటర్న్ షిప్ కు ఇస్తున్న నాలుగు క్రెడిట్లకు బదులు ఐదు క్రెడిట్లను ఇవ్వనున్నామని పేర్కొన్నారు. డిగ్రీకి గతంలో మాదిరిగానే 150 క్రెడిట్స్  విధానం కంటిన్యూ అవుతుందని వెల్లడించారు. ఈ  సమావేశంలో కౌన్సిల్  సెక్రటరీ శ్రీరాంవెంకటేశ్   తదితరులు పాల్గొన్నారు.