- ఆఫీసర్లను ఆదేశించిన మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, వెలుగు: నెల్లికల్లు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణ పనులను వచ్చే ఏడాది ఏప్రిల్ చివరి నాటికల్లా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. భూసేకరణ గురించి రైతులతో సంప్రదింపులు జరిపి, పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం సెక్రటేరియెట్‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే కుందూరు జయధీర్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, నల్గొండ కలెక్టర్ నారాయణ రెడ్డి, చీఫ్ ఇంజినీర్లు అజయ్ కుమార్, నాగేశ్వరరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అటవీశాఖ భూములకు పరిహారం చెల్లించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
పెండింగ్ లో ఉన్న రూ.23 కోట్ల విద్యుత్ బకాయిలతో పాటు పెరిగిన విద్యుత్ బకాయిల ప్రతిపాదనలు తక్షణమే పంపాలని సూచించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 5 చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి టెండర్లు పిలవాలని ఆదేశించారు. ఏఎంఆర్‌పీ కెనాల్‌లో చెత్త, చెదారం తొలగించాలని, మరమ్మతులు ఉంటే వెంటనే చేయించాలని మంత్రి సూచించారు.