- నాందేడ్ కాంగ్రెస్ నేతలతో మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఉన్న లెండి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముద్ఖేడ్ వద్ద ప్రారంభించిన లెండి ప్రాజెక్ట్ పూర్తయితే.. తెలంగాణలోని 38,573.15 ఎకరాలు, మహారాష్ట్రలో 27,710 ఎకరాలకు నీళ్లు అందుతాయని చెప్పారు. గురువారం నాందేడ్‌కు చెందిన కాంగ్రెస్ నేతలు సెక్రటేరియెట్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు.
ఇప్పటిదాకా రెండు రాష్ట్రాలు ఈ ప్రాజెక్ట్‌పై రూ.1,040.87 కోట్లు ఖర్చు చేశాయని, 70 శాతం మేర ఎర్త్ వర్క్, 80 శాతం వరకు స్పిల్ వే పనులు పూర్తయ్యాయన్నారు. కాలువల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయన్నారు. అయితే, నిర్వాసితులు పరిహారం కోసం ప్రాజెక్టుకు అడ్డుపడడంతో 2011లో పనులు ఆగిపోయాయని తెలిపారు. ఆ పనులను పునురద్ధరించి నదిలోని మట్టి పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది చివరి నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు.