ఎల్ఆర్ఎస్​కు గడువు పెంచినా.. స్పందన అంతంతే.. 20 రోజుల్లో 70 కోట్లు మాత్రమే వసూలైన ఫీజు

ఎల్ఆర్ఎస్​కు గడువు పెంచినా.. స్పందన అంతంతే..  20 రోజుల్లో 70 కోట్లు మాత్రమే వసూలైన ఫీజు
  • మరో 9 రోజుల్లో ముగియనున్న గడువు
  • మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మరో 7 వేల కోట్లు రావొచ్చని అంచనా
  • ఇప్పటి వరకు రూ.1,070 కోట్లు మాత్రమే వసూలు

హైదరాబాద్, వెలుగు: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ ఆర్ ఎస్ )కు ప్రభుత్వం నెల రోజులు గడువు పెంచినా.. ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. ఫీజు చెల్లించేందుకు గత నెల 31నే గడువు ముగిసినా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వచ్చిన అప్లికేషన్లలో 10 శాతం మంది కూడా ఫీజు చెల్లించకపోవడం, టెక్నికల్ సమస్యల కారణంగా మరో నెల పాటు (ఈ నెల 30 వరకు) పొడిగించారు. అయినప్పటికీ ఫీజు వసూలు అయిన అప్లికేషన్లలో కేవలం 10 శాతం మాత్రమే క్లియర్ అయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 

ఈ నేపథ్యంలో మరో నెల పాటు గడువు పొడిగించేందుకు ప్రభుత్వం అంగీకరిస్తుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రభుత్వానికి వివిధ స్కీమ్ ల అమలుకు నిధులు కొరత ఉన్న నేపథ్యంలో వచ్చే రెవెన్యూనును వదులుకోదని అధికారవర్గాల్లో చర్చ జరగుతోంది. ఎల్ఆర్ఎస్ అంశంపై ఇటీవల జిల్లా కలెక్టర్లతో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెలాఖరు వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించగా.. టెక్నికల్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, కలెక్టర్లు ఏకరవు పెట్టినట్టు తెలిసింది.

20 రోజుల్లో 70 కోట్లు

మార్చి  31 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని  మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రూ.1,000 కోట్లు ఫీజు వసూలు కాగా.. సోమవారం నాటికి రూ.1,076 కోట్లు మాత్రమే వసూలు అయింది. అంటే 20 రోజుల్లో కేవలం రూ.76 కోట్లు మాత్రమే వసూలు అయింది.  మొత్తం రూ. 7 వేల కోట్లు వసూలవుతుందని ప్రభుత్వం అంచనా వేయగా ఇప్పటి వరకు రూ.1,500 కోట్లు కూడా వసూలు కాలేదు. మొత్తం 15 లక్షల 39 వేల అప్లికేషన్లు ఎల్ ఆర్ ఎస్ కు వచ్చాయి. అందులో అప్లికేషన్ ప్రాసెస్ చేసి ఫీజు చెల్లించాలని సమాచారం ఇచ్చిన అప్లికేషన్లు 10 లక్షల 85 వేలు ఉండగా.. ఇందులో 2 లక్షల 23 వేల మంది ఫీజు చెల్లించినట్టు  డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్  (డీటీసీపీ) అధికారులు చెబుతున్నారు. ఇందులో 8 లక్షల 61 వేల అప్లికెంట్లు ఫీజు చెల్లించాల్సి ఉంది. మరో 9 రోజుల్లో గడువు ముగియనున్న నేపథ్యంలో మరో లక్ష మంది ఫీజు చెల్లించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఫీజు కట్టాక ప్రొహిబిటెడ్​ లిస్టులో  చూపిస్తోంది

నాకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 100 గజాల ఓపెన్​ప్లాట్ఉంది. ఆ ప్లాట్​ రెగ్యులరైజేషన్ చేసుకునేందుకు 2022లో రూ.1000తో  ఎల్ఆర్ఎస్​కు అప్లై చేశాను. మార్చిలో ఎల్ఆర్ఎస్ ఫీజు జనరేట్అయిందని రూ.12 వేలు కట్టమని నాకు మున్సిపల్ సిబ్బంది కాల్​ చేసి చెప్పారు. అప్పుడు డబ్బులు లేకపోవడంతో కట్టలేదు. ఇప్పుడు కడుదామని ఆన్​లైన్​లో చూస్తే నా ఫ్లాట్ఎఫ్టీఎల్/ప్రొహిబిటెడ్​ లిస్ట్ లో చూపిస్తోంది. అదే సర్వే నంబర్​లో ఇతర ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ఫీజు జనరేట్అయింది. వారు పేమెంట్​ కూడా చేశారు. దీనికి సంబంధించి మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ నుంచి ఎన్వోసీ కూడా తెచ్చాను. దాంతో మున్సిపల్​ కమిషనర్​కు మళ్లీ దరఖాస్తు చేస్తే అది టెక్నికల్ ఇష్యూ అని పరిష్కారం అవుతుందని చెప్పారు. ఆ తర్వాత ఎల్ఆర్ఎస్  వెబ్ సైట్​లో ఫిర్యాదు చేసినా.. నో రెస్పాన్స్. ఇప్పటిదాకా సమస్య పరిష్కారమవుతుందని ఎదురుచూశాను. మరో 9 రోజులే టైం ఉంది. ఏంచేయాలో అర్థం కావట్లేదు.నరేష్, తొర్రూరు మున్సిపాలిటీ, మహబుబాబాద్ జిల్లా

పరిష్కారం కాని టెక్నికల్ సమస్యలు

ఎల్ ఆర్ ఎస్ స్కీమ్ స్టార్ట్ అయిన నాటి నుంచి టెక్నికల్ సమస్యలు వస్తున్నాయని పెద్ద ఎత్తున ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. వీటి పరిష్కారంపై  మున్సిపల్ కమిషనర్లకు అవగాహన లేకపోవడం, పబ్లిక్ వచ్చి అడిగినా మాకేం తెలియదని సమాధానాలిస్తున్న సందర్భాలు నిత్యం ఎన్నో బయటపడుతున్నాయి. అప్లికేషన్ ప్రాసెస్ లో చెల్లించాల్సిన ఫీజు చూపించి, తరువాత నిషేధిత జాబితాలో మీ ప్లాట్ ఉందని చూపించడం, నిషేధిత జాబితా చూస్తే అందులో ప్లాట్ లేదని, ఫీజు చెల్లిద్దామంటే ఓపెన్ కావడం లేదని పలువురు పబ్లిక్ చెబుతున్నారు.