- మరో ఐదు కేసుల నమోదుకు రంగం సిద్ధం
- ఎంబీబీఎస్ లేకుండా అల్లోపతి ట్రీట్మెంట్ నేరమని వార్నింగ్
- ఆర్ఎంపీ, పీఎంపీలలో కలవరం
- పారా మెడికల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని సర్కారుకు వినతి
నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీల మెడికల్ ప్రాక్టీస్‌పై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. ఎంబీబీఎస్ డిగ్రీ లేకుండా అల్లోపతి ట్రీట్మెంట్ చేయడం చట్ట ప్రకారం నేరమని ఇప్పటికే 11 మంది ప్రైవేటు ప్రాక్టీషనర్లపై కేసులు నమోదు చేశారు. అయితే పారా మెడికల్ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు అందిస్తేనే గట్టెక్కుతామని ఆర్ఎంపీ, పీఎంపీలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. దీని కోసం ఫిబ్రవరి 18న స్టేట్ లెవెల్ మీటింగ్ కు సన్నాహాలు చేస్తున్నారు.
2,400 దాకా క్లినిక్‌లు
నిజామాబాద్ జిల్లాలో నగర పాలక సంస్థ, మూడు మున్సిపాలిటీలు, 545 గ్రామ పంచాయతీలుండగా ఆర్ఎంపీ, పీఎంపీ లు సుమారు 2,400 మంది అల్లోపతి మందులతో ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో ఐదేండ్లు పనిచేసి అక్కడి మేనేజ్మెంట్ నుంచి పొందిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ తో ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు.ప్రధాన హాస్పిటల్స్ మాదిరి బెడ్లు ఏర్పాటు చేసి సిజేరియన్లు, అబార్షన్లు చేసి హైడోస్ మెడిసిన్స్‌తో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ట్రీట్మెంట్ ఖర్చు తక్కువ అనే భావనతో ఎక్కువ మంది గ్రామస్తులు ఆర్ఎంపీలు, పీఎంపీలను ఆశ్రయిస్తున్నారు. టౌన్‌లోని ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్వాహకులు ఆర్ఎంపీ, పీఎంపీలను ఏజెంట్లుగా కూడా వాడుకుంటున్నారు.
మెడికల్ కౌన్సిల్ ఎంట్రీతో పరేషాన్
రాష్ట్రంలోని వరంగల్, వర్థన్నపేట, ఖమ్మం, మంచిర్యాల, హుజురాబాద్‌లో అర్హత లేకుండా ట్రీట్మెంట్చేయడంతో రోగుల ప్రాణాలు పోయిన ఘటనలను సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ సర్కారు మెడికల్ కౌన్సిల్‌ను అలర్ట్ చేసింది. కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలో నవంబర్, డిసెంబర్ రెండు నెలల్లో తనిఖీలు నిర్వహించి 350 మంది నకిలీ డాక్టర్లపై కేసులు పెట్టారు.
నిజామాబాద్ జిల్లాలో 11 మందిపై కేసులు నమోదు కాగా రెండు రోజుల కింద జైలుకు వెళ్లారు. నగరంలోని టు టౌన్లో మరో ఐదు కేసులు నమోదు కానున్నాయి. యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ మెడిసిన్స్, మినీ ఆపరేషన్ థియేటర్లు నిర్వహిస్తున్నట్లు తనిఖీలలో తేలింది. ఎంబీఎస్, డీహెచ్ఎస్ ఇతర ఏవో కొత్త డిగ్రీలను తమ పేర్ల కింద యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్నట్లు గుర్తించి యాక్షన్ తీసుకుంటున్నారు.