నకిలీ డాక్టర్లు, హాస్పిటళ్ల కట్టడికి స్పెషల్‌‌‌‌ టాస్క్​ఫోర్స్‌‌‌‌

  • తెలంగాణ మెడికల్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకో టీమ్‌‌‌‌
  • ఇప్పటికే వరంగల్‌‌‌‌, నల్గొండ, మెదక్, ఆదిలాబాద్‌‌‌‌ జిల్లాల్లో ఏర్పాటు
  • మెంబర్లుగా స్పెషలిస్ట్‌‌‌‌ డాక్టర్లు, పోలీసులు, అడ్వకేట్లు, జర్నలిస్టులు
  • ఫిర్యాదు అందగానే ఎంక్వైరీ చేసి టీజీఎంసీకి రిపోర్ట్‌‌‌‌ ఇవ్వనున్న టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌

మంచిర్యాల, వెలుగు : రాష్ట్రంలో నకిలీ డాక్టర్లు, బోగస్‌‌‌‌ హాస్పిటళ్ల కట్టడికి తెలంగాణ మెడికల్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ (టీజీఎంసీ) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న విజిలెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌లకు తోడుగా ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక మెడికల్‌‌‌‌ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ను ఏర్పాటు చేస్తోంది. వరంగల్, నల్గొండ, మెదక్, ఆదిలాబాద్‌‌‌‌ జిల్లాల్లో ఇప్పటికే ప్రత్యేక టీమ్స్‌‌‌‌ను ఏర్పాటు చేయగా, మిగతా జిల్లాల్లో కూడా టీమ్స్‌‌‌‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. ఆయా జిల్లాల్లోని టీజీఎంసీ మెంబర్ల ఆధ్వర్యంలో ఈ టీమ్‌‌‌‌లు పనిచేయనున్నాయి. 

ఒక్కో టీమ్‌‌‌‌లో 20 నుంచి 30 మంది డాక్టర్లు

ఉమ్మడి జిల్లా పరిధిలోని 20 నుంచి 30 మంది స్పెషలిస్ట్‌‌‌‌ డాక్టర్లతో మెడికల్‌‌‌‌ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఇండియన్‌‌‌‌ మెడికల్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ (ఐఎంఏ), తెలంగాణ హాస్పిటల్స్‌‌‌‌ అండ్‌‌‌‌ నర్సింగ్‌‌‌‌ హోమ్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ (తానా), హెల్త్‌‌‌‌కేర్‌‌‌‌ రిఫార్మ్స్‌‌‌‌ డాక్టర్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ (హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌డీఏ)తో పాటు తెలంగాణ గవర్నమెంట్‌‌‌‌ డాక్టర్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ (టీజీడీఏ)లకు చెందిన డాక్టర్లు సభ్యులుగా ఉంటారు. 

అలాగే మెడికల్‌‌‌‌ అండ్‌‌‌‌ హెల్త్, డ్రగ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌, పొల్యూషన్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ బోర్డు, పోలీస్‌‌‌‌ ఆఫీసర్లు సహా అడ్వకేట్లు, ఎన్‌‌‌‌జీవోల ప్రతినిధులు, జర్నలిస్టులను సైతం భాగస్వాములను చేస్తున్నారు. టీజీఎంసీ మెంబర్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ యెగ్గెన శ్రీనివాస్‌‌‌‌ ఆధ్వర్యంలో ఇటీవలే ఉమ్మడి ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా టీమ్‌‌‌‌ను ఏర్పాటు చేశారు. ఇందులో నాలుగు జిల్లాలకు చెందిన 30 మంది 
డాక్టర్లు ఉన్నారు.

నకిలీ డాక్టర్లు, హాస్పిటళ్లపై చర్యలు

రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న నకిలీ డాక్టర్లు, బోగస్‌‌‌‌ హాస్పిటళ్లను కంట్రోల్‌‌‌‌ చేయడం ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందేలా చూడడం ఈ మెడికల్‌‌‌‌ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ బాధ్యత. ప్రస్తుతం ఉన్న విజిలెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌లు కూడా క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. వివిధ జిల్లాల్లోని పలు హాస్పిటళ్లు, ఆర్‌‌‌‌ఎంపీ, పీఎంపీ క్లినిక్‌‌‌‌లపై ఆకస్మిక దాడులు చేసి వారి బండారాన్ని బయటపెడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 400 మంది నకిలీ డాక్టర్లు, హాస్పిటళ్లపై క్రిమినల్‌‌‌‌ కేసులు నమోదయ్యాయి.

ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం ఉమ్మడి జిల్లాల వారీగా టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ టీంలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రైవేట్‌‌‌‌ హాస్పిటళ్లలో సరైన వైద్యం అందకపోవడం, డాక్టర్ల నిర్లక్ష్యం, విచ్చలవిడిగా డబ్బులు తీసుకోవడం, అంబులెన్స్‌‌‌‌ నిర్వాహకులు కమీషన్లు తీసుకొని పేషెంట్లను రిఫర్‌‌‌‌ చేయడం, ఇతరత్రా సమస్యలపై బాధితులు మెడికల్‌‌‌‌ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ను సంప్రదించవచ్చు. ఈ ఫిర్యాదులపై టీం మెంబర్స్‌‌‌‌ ఎంక్వైరీ చేసి టీజీఎంసీకి రిపోర్ట్‌‌‌‌ ఇస్తారు. దాని ఆధారంగా సదరు డాక్టర్లు, హాస్పిటళ్లపై చర్యలు తీసుకుంటారు. 

ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయం 

ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా టీజీఎంసీ ఉమ్మడి జిల్లాకో మెడికల్‌‌‌‌ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ను ఏర్పాటు చేస్తోంది. కమీషన్లతో ప్రజలపై భారం మోపుతున్న నకిలీ డాక్టర్లు, వారికి సహకరిస్తున్న హాస్పిటల్స్‌‌‌‌పైన టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ టీం చర్యలు తీసుకుంటుంది. వైద్యవృత్తిలో విలువలు, నమ్మకం పెంచడానికి, ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తోంది. హాస్పిటళ్లలో వైద్యపరమైన సమస్యలు ఎదురైనా,   నకిలీ డాక్టర్లు, అంబులెన్స్‌‌‌‌నిర్వాహకులు తప్పుదారి పట్టించినా టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ టీంను సంప్రదించవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా బాధితులు హెల్ప్‌‌‌‌లైన్‌‌‌‌ 75575 55777 నంబర్‌‌‌‌కు కాల్‌‌‌‌ చేయాలి.  – డాక్టర్​ యెగ్గెన శ్రీనివాస్​, టీజీఎంసీ మెంబర్​, మంచిర్యాల