మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ జీతాలు ఇవ్వాలి

మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ జీతాలు ఇవ్వాలి

ముషీరాబాద్,వెలుగు: మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ జీతాలు విడుదల చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల వేతనం ఇవ్వాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది.  యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం  ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వై స్వప్న, ఎస్వీ  రమణ మాట్లాడుతూ.... మధ్యాహ్న భోజన నిర్వహణలో పనిచేస్తున్న మహిళలంతా అట్టడుగు వర్గాలకు చెందినవారని, వారికిచ్చే వేతనం చాలా తక్కువగా ఉందన్నారు.

 వారికి ఇచ్చే జీతం నెలల తరబడి పెండింగ్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోందని ,  వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 నెలల నుండి కోడిగుడ్ల బిల్లులు, 3 నెలల వేతన బకాయిలు పెండింగ్లో ఉన్నాయని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.