నారాయణపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తాం

నారాయణపూర్ రిజర్వాయర్  పనులు పూర్తి చేస్తాం

ముంపునకు గురవుతున్న ప్రజలకు న్యాయం చేస్తాం 
రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై, జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 
మంత్రి పొన్నంతో కలిసి కలికోట సూరమ్మ  ప్రాజెక్టు పనుల పరిశీలన

తిమ్మాపూర్/గంగాధర/రుద్రంగి/జగిత్యాల/కథలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ ధర్మపురి, వెలుగు: చొప్పదండి నియోజకవర్గంలోని  నారాయణపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై, జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  తెలిపారు. అత్యంత ప్రాధాన్యమిస్తున్న ప్రాజెక్టుల జాబితాలో నారాయణపూర్ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చేరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాల అమలుకు గ్రామసభల నిర్వహణలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట, గంగాధర మండలం నారాయణపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రం, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామంలో బుధవారం నిర్వహించిన గ్రామసభలకు బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఆయన హాజరయ్యారు. 

ఈ సందర్భంగా నారాయణపూర్ రిజర్వాయర్ ను, కలికోట సూరమ్మ ప్రాజెక్టును సందర్శించారు. నారాయణపూర్ గ్రామసభలో ఉత్తమ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రూ.లక్షల కోట్లు  ఖర్చు చేసి తక్కువ ఆయకట్టుకు నీరిచ్చిందన్నారు. ఈ ప్రభుత్వం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. నారాయణపూర్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌కు రూ.70 కోట్లు రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేసి ఏడాదిలోగా ప్రాజెక్టు పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లు ఇస్తామన్నారు. రిజర్వాయర్ ముంపు విషయంలో నారాయణపూర్ ప్రజలకు న్యాయం చేస్తామని తెలిపారు. అనంతరం మంత్రులు ఉత్తమ్, పొన్నం  కలికోట - సూరమ్మ ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు.  పనులు వేగంగా పూర్తి చేసి, ప్రాజెక్ట్ పరిధిలోని భూములకు సాగునీరు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మిగతా ఇతర పనులకు అన్ని నిధులను త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. 

దేశంలో ఎక్కడా లేని విధంగా స్కీములు : మంత్రి పొన్నం ప్రభాకర్ 

దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పథకాలను అమలుచేస్తున్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు పదేళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారని, అర్హులందరికీ రేషన్‌‌‌‌‌‌‌‌ కార్డులు మంజూరుచేస్తామన్నారు. 

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేనివిధంగా జనవరిలోనే  నారాయణపూర్ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎల్లంపల్లి నీటిని తీసుకొచ్చామని తెలిపారు. మెట్ట ప్రాంతంగా ఉన్న చొప్పదండి నియోజకవర్గంలో జలయజ్ఞంలో భాగంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నారాయణపూర్ రిజర్వాయరన్‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు.

రుద్రంగిలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ 43,100 ఎకరాలకు సాగు నీరందించే కలికోట సూరమ్మ ప్రాజెక్టును మొదటి ప్రాధాన్యత జాబితాలో పెట్టి త్వరలో పూర్తయ్యేలా చూడాలని మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌ను విజ్ఞప్తి చేశారు. వేములవాడ, తిప్పా పూర్, కథలాపూర్ బస్టాండ్ ఆధునీకరణకు నిధులు మంజూరు చేయాలని  రవాణా శాఖ మంత్రి పొన్నంను కోరారు.

ఆయా గ్రామ సభల్లో విప్ అడ్లూరి లక్ష్మణ్​ కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్ కుమార్ ఝా, సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, ఖీమ్యా నాయక్, ట్రైనీ 
కలెక్టర్ అజయ్ యాదవ్ పాల్గొన్నారు.