- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్ నగర్, వెలుగు : రాష్ట్రంలోని ప్రజలందరూ భోగభాగ్యాలతో సుభిక్షంగా వెలుగొందాలని ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కులమతాలకతీతంగా రాష్ట్ర ప్రజలు సంక్రాంతి పర్వదినాన్ని ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి వెన్నెముకగా నిలిచే రైతాంగానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ చేయూతనందించడంలో ముందుంటుందని తెలిపారు.
ప్రస్తుతం నడుస్తున్నది.. రైతు నామ సంవత్సరమని పేర్కొన్నారు. యావత్ భారతదేశంలోనే రైతాంగం కనీవినీ ఎరగని రీతిలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుమతి సాధించడం తెలంగాణ రైతుల గొప్పతనాన్ని తెలియజేస్తుందని వివరించారు. ప్రభుత్వం ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు
నల్గొండ అర్బన్, వెలుగు : రాష్ట్ర ప్రజలకు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతిఒక్కరూ భక్తిశ్రద్ధలతో కుటుంబ సమేతంగా జరుపుకోవాలని సూచించారు.
మన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవడమే అసలైన పండగ పరమార్థమని గుర్తుచేశారు. ప్రజలంతా స్వేచ్ఛ, సౌభాగ్యాలతో సంబురంగా సంక్రాంతిని జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ పండగ తెలంగాణ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యబద్ధంగా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వానికి దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.