రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు వెంటనే ప్రారంభించండి : గడ్డం వంశీకృష్ణ

రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు వెంటనే ప్రారంభించండి : గడ్డం వంశీకృష్ణ
  • కేంద్రానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వినతి
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేత
  • ఎంపీ విజ్ఞప్తితో కేంద్ర వ్యవసాయ మంత్రికి కిషన్ రెడ్డి ఫోన్​కాల్
  • పత్తి కొనుగోలు చర్యలు తక్షణమే ప్రారంభించాలని సీసీఐకి ఆదేశం

న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణలో పత్తి కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీలోని శాస్త్రి భవన్​లో కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డితో ఎంపీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అరగంటపాటు సాగిన ఈ భేటీలో తెలంగాణలో పత్తికొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం, తక్షణ అవసరాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వివరించారు. కొనుగోళ్ల ఆలస్యంతో పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. 

న్యాయమైన ధరలు, సమయానికి కొనుగోళ్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పారు. ఇందుకు సంబంధించిన వినతిపత్రాన్ని కిషన్​ రెడ్డికి అందజేశారు. వంశీకృష్ణ విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన కిషన్ రెడ్డి.. కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్​సింగ్​తో మాట్లాడారు. 

పత్తి కొనుగోళ్ల అంశాన్ని గిరిరాజ్ సింగ్​కు వివరించారు. దీంతో గిరిరాజ్ సింగ్.. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) చైర్మన్, ఎండీ లలిత్ కుమార్​తో ఫోన్​లో మాట్లాడారు. తెలంగాణలో పత్తి కొనుగోళ్లపై జరుగుతున్న జాప్యం, ఇతర అంశాలపై ఆరా తీశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించి, పత్తి కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలన్నారు. అనంతరం ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ..  రైతులకు న్యాయం జరిగేలా, పత్తి కొనుగోళ్లు వెంటనే ప్రారంభించేందుకు తన వంతు కృషిని కొనసాగిస్తానని పేర్కొన్నారు.