కొత్త లీడర్ల రాకతో.. సీనియర్లలో టెన్షన్​

నిజామాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎలక్షన్ల వేళ పార్టీల్లో కొత్త లీడర్ల చేరికలు, తమకే టికెట్​వస్తుందని ధీమాతో ఉన్నవారిలో గుబులు రేపుతున్నాయి. ఎక్కడ తమకు పోటీ అవుతారోనని సీనియర్లు​ టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉన్నచోట రాజకీయ చర్చకు తెర లేపుతున్నాయి.

నిజామాబాద్​ రూరల్​లో..

రూరల్ ​నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్​ భూపతిరెడ్డి కాంగ్రెస్ టికెట్​ఆశిస్తున్నారు. వైద్య వృత్తిని పక్కనబెట్టి ప్రజల మధ్య ఉంటున్నారు. గతంలో పోటీ చేసే చాన్స్​ అందినట్లే అంది చేజారింది. దీంతో టీఆర్ఎస్​ను వీడి, కాంగ్రెస్​లో చేరారు. పాలిటిక్స్​లో క్రియాశీలకంగా ఉంటున్న ఆయనకు ఇప్పటికే మార్కెట్​కమిటీ అధ్యక్షుడు నగేశ్​రెడ్డితో పొసగడం లేదు. తాజాగా మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్​లోకి వస్తున్నారు. ఆయన చేరిక ఇప్పటికే టికెట్​ రేసులో ఉన్న నేతలకు మింగుడు పడడం లేదు.

బాల్కొండలో.. 

బాల్కొండ నియోజకవర్గంపై డీసీసీ ప్రెసిడెంట్​మానాల మోహన్​రెడ్డి, కిసాన్​ కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్​రెడ్డి కన్నేశారు. ఇప్పుడు ముత్యాల సునీల్​రెడ్డి కాంగ్రెస్​లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. మాజీ మంత్రి సుదర్శన్ ​రెడ్డికి బంధువైన సునీల్​రెడ్డి​ చేరికను కాంగ్రెస్​ హైకమాండ్​ ఓకే చెప్పినట్లు  తెలుస్తోంది.
 
ఆర్మూర్​లోనూ అంతే..

బీజేపీకి ఆర్మూర్​ నుంచి ఉద్దండ లీడర్లు ఉన్నారు. జిల్లా పార్టీకి నాయకత్వం వహించిన చరిత్ర ఆ ప్రాంతానికి ఉంది. ప్రతీ ఎలక్షన్​లో బీజేపీ టికెట్​ కోసం పోటీ తీవ్రంగా ఉంటుంది. ఈ సారి టికెట్​ మాకే వస్తుందని వినయ్​రెడ్డి, కంచెట్టి గంగాధర్​ ​ధీమాతో ఉన్నారు. కొత్తగా పారిశ్రామిక వేత్త పైడి రాకేశ్​రెడ్డి జాయినయ్యారు. ఆయన చేరికతో పార్టీలో జోష్​ వచ్చినా, టికెట్​విషయంలో మిగతావారు హైరానా పడుతున్నారు. 

బోధన్​ బీజేపీలోకి మహారాష్ట్ర వాసి..

బోధన్​లో బీజేపీ పక్షాన ప్రకాశ్​రెడ్డి, మోహన్​రెడ్డి యాక్టివ్​గా ఉన్నారు. వీరిద్దరూ ఒకరి తర్వాత ఒకరు బీజేపీలో చేరారు. టికెట్​ తమకే దక్కుతుందని ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. అయితే మహారాష్ట్రలో సెటిల్​అయిన బోధన్​ ప్రాంతవాసి బీజేపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది.

అర్బన్​లోనూ.. 

అర్బన్​ కాంగ్రెస్​లోనూ టికెట్​ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​మహేశ్​గౌడ్, ఉపాధ్యక్షుడు తాహెర్, మాజీ మేయర్​ సంజయ్, యూత్​ కోటాలో కేశ వేణు ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. ఎలక్షన్​ నాటికి ఇతర పార్టీల ప్రముఖులు కాంగ్రెస్​లో చేరే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు.