
- 25 ఏండ్లు వాయిదా వేయాల్సిందే: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గించే కుట్ర: కోదండరాం
- యూపీ, ఎంపీ, బిహార్ లో సీట్లు పెంచే కుట్ర: వీకేసీ చీఫ్, ఎంపీ తిరుమావళన్
- వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో భారీ దీక్ష చేద్దాం: అద్దంకి
- టీజేఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సెమినార్
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీకి పదవీవ్యామోహమని, శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఇందులో భాగంగానే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసే విధంగా డీలిమిటేషన్ చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టకుండా అడ్డుకుంటామని, దక్షిణాదికి, తెలంగాణ రాష్ట్రానికి ఒక ఇంచు నష్టం కూడా జరగనివ్వబోమని స్పష్టం చేశారు.
పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన– దక్షిణ భారత భవిష్యత్తు’’ అనే అంశంపై టీజేఎస్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో రాష్ట్రస్థాయి సెమినార్ నిర్వహించారు. ఇందులో మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల వాటా కనీసం 35 శాతం ఉండేలా సీట్ల సంఖ్యను పెంచాలని, లేదా మరో 25 ఏండ్ల పాటు ఈ అంశాన్ని వాయిదా వేయాలని
డిమాండ్ చేశారు.
రాజకీయ భవిష్యత్తు మార్చే కీలక ఘట్టం
డీలిమిటేషన్ దేశ రాజకీయ భవిష్యత్తును మార్చే కీలక ఘట్టమని టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజాస్వామిక ప్రాతినిధ్యాన్ని నెమ్మదిగా తగ్గించాలనే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. దీన్ని ఎదుర్కోవాలంటే సౌత్ప్రజలు, రాజకీయ పార్టీలు, సమాజం ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షుడు, చిదంబరం ఎంపీ డా.తిరుమావళవన్ మాట్లాడుతూ దేశ హితం కోసం జనాభా నియంత్రణను పకడ్బందీగా అమలుచేసిన దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ ఒక శాపంగా మారుతున్నదన్నారు. మోదీ ప్రభుత్వం యూపీ, బీహార్, మధ్యప్రదేశ్(ఎంపీ), రాజస్థాన్ రాష్ట్రాల లోక్ సభ సీట్లను భారీగా పెంచాలని కుట్రలు చేస్తున్నదన్నారు.
దళితులు, ఆదివాసీలు, ముస్లింల ఓట్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలను ఇష్టారీతిన విభజించే కుట్రలు జరుగుతున్నాయని హెచ్చరించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశంలో ‘లోక్‌సభ సీట్లను పెంచవద్దు– యథాతథంగా ఉంచాలి’ అనే తీర్మానానికి తెలంగాణలోని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని కోరారు. డీలిమిటేషన్ ను కేంద్ర ప్రభుత్వం ఒక ఆయుధంగా ఉపయోగించాలని చూస్తుందని విల్లుపురం ఎంపీ రవికుమార్ అన్నారు.
బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాది, హిందీ బెల్టు రాష్ట్రాల్లో సీట్లను పెంచేలా డీలిమిటేషన్ చేసేందుకు ప్లాన్చేసిందని ఆరోపించారు. ఇదే జరిగితే బీజేపీ ప్రస్తుత రాజ్యాంగాన్ని రద్దు చేసి, తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటుందని తెలిపారు.
సౌత్రాష్ట్రాలపై వివక్ష
దక్షిణాది రాష్ట్రాల మీద వివక్ష కొనసాగుతుందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో భారీ దీక్ష లేదా ధర్నా చేసి ఐక్యతను కేంద్రానికి చాటి చెప్పాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా, నియంతృత్వంగా వ్యవహరిస్తున్నదని సీపీఐ నేత పశ్య పద్మ అన్నారు. కేంద్రంలో తమ అధికారాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకు డీలిమిటేషన్ అంశాన్ని ఒక ఆయుధంగా మల్చుకున్నదని ఆరోపించారు.
డీలిమిటేషన్శాస్త్రీయ పద్ధతిన చేపట్టాలని లేదా ప్రస్తుతం ఉన్న సీట్ల నిష్పతి ప్రకారం చేపట్టాలని సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, సామాజిక కార్యకర్తలు, విశ్లేషకులు పాల్గొని డీలిమిటేషన్‌పై ఆందోళన వ్యక్తం చేశారు.