
- దేశ ఫార్మారంగంలో తెలంగాణది కీలకపాత్ర: కిషన్‌రెడ్డి
- హైదరాబాద్ నుంచే అధిక ఆదాయం వస్తున్నదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: దేశ ఫార్మా రంగంలో తెలంగాణది కీలక పాత్ర అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దేశంలోని ఫార్మా ఆదాయంలో 35 శాతం, బల్క్ డ్రగ్స్‌లో 40 శాతం ఆదాయం హైదరాబాద్‌సిటీ నుంచే వస్తున్నదని చెప్పారు. 800 ఫార్మా, బయోటెక్, మెడిటెక్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయని వెల్లడించారు. ప్రపంచ ఫార్మసీ, హాస్పిటల్స్హబ్గా హైదరాబాద్ అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.
బుధవారం హైదరాబాద్‌లో బయో ఏషియా–2025 సదస్సు ముగింపు కార్యక్రమంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. బల్క్ డ్రగ్క్యాపిటల్, వ్యాక్సిన్క్యాపిటల్గా హైదరాబాద్‌సిటీ ఎంతో పురోగతి సాధించిందని తెలిపారు. జీనోమ్ వ్యాలీ, ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్కు వంటివి విదేశీ పెట్టుబడులను ఆకర్షించి, 2047 నాటికి 500 బిలియన్ డాలర్ల లైఫ్ సైన్సెస్ ఎకానమీని సృష్టించే దిశగా హైదరాబాద్ అడుగులు వేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ సదస్సు..ఓ మైలురాయి: శ్రీధర్ బాబు
ఈ ఏడాది బయోఏషియా సదస్సుకు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చిందని.. ఇది ఓ మైలురాయిగా నిలుస్తుందని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. దేశ, విదేశాల నుంచి 4 వేల మంది ఫార్మా, హెల్త్కేర్ఇండస్ట్రీ లీడర్స్, పాలసీ మేకర్లు, ఆవిష్కర్తలు హాజరయ్యారని.. 84 స్టార్టప్ కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. పోయినేడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని చెప్పారు.
స్కిల్ వర్సిటీ ద్వారా సింథటిక్ ఆర్గానిక్కెమిస్ట్రీ అనే ప్రత్యేక కోర్సును ప్రారంభించామని, మొదటి బ్యాచ్‌లో 140 మంది విద్యార్థులు శిక్షణ పూర్తి చేసుకున్నారని వెల్లడించారు. కాగా, జీనోమ్‌వ్యాలీలో వ్యాక్సిన్టెస్టింగ్ఫెసిలిటీ ఏర్పాటు చేసేలా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. త్వరలోనే రాష్ట్రంలో లైఫ్‌సైన్సెస్ పాలసీని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఐదు స్టార్టప్‌లకు అవార్డులు..
కొత్త ఆవిష్కరణలు చేసిన ఐదు స్టార్టప్‌లకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్రమంత్రి శ్రీధర్‌బాబు అవార్డులు అందజేశారు. సెమ్జీనోమ్, జెనికా బయోసైన్స్, ప్రోఎంజ్బయోసైన్సెస్, బోల్ట్జ్మాన్ల్యాబ్స్, యుటోపియా థెరప్యుటిక్స్అనే స్టార్టప్ కంపెనీలు అవార్డులు అందుకున్నాయి.