
- నాడు బచావత్ ట్రిబ్యునల్ ముందు సరిగ్గా వాదనలు వినిపించలే
- బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదించిన తెలంగాణ
- 150 టీఎంసీల ఎస్ఎల్ బీసీనీ ముందుకు పోనివ్వలేదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: 1928 అగ్రిమెంట్ నుంచి నీళ్ల వాటాల విషయంలో తమకు అన్యాయం జరుగుతూనే ఉన్నదని కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదించింది. ఆనాడు కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్– 1 (బచావత్ ట్రిబ్యునల్) ముందు సరైన వాదనలు వినిపించలేదని, ఫలితంగా నష్టపోయామని పేర్కొన్నది. ఆ తర్వాత 1950ల్లో ఎస్సార్సీ రిపోర్టులోనూ పేర్కొన్న అంశాల ఆధారంగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించింది. తెలంగాణ స్వతంత్ర రాష్ట్రంగా ఉండకూడదంటూ నాడు ఏపీ వాదించిందని తెలిపింది.
మంగళవారం కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్– 2 (బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్) ముందు రెండో రోజు తెలంగాణ తన వాదనలు వినిపించింది. హైదరాబాద్ స్టేట్‌లో 174.3 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టులకు ప్రతిపాదనలు వచ్చినా.. ఆనాడు ముందుకు తీసుకెళ్లలేదని పేర్కొన్నది. అందులోనే 20 టీఎంసీల సామర్థ్యంతో భీమా ప్రాజెక్టును తలపెట్టినా.. అడ్డుకున్నారని తెలిపింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే దానిని ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించింది.
ఇన్ బేసిన్‌కే ఇవ్వాలి
ఎక్కడైనా ముందు ఇన్బేసిన్ అవసరాలకే నీటి కేటాయింపులపై ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని తెలంగాణ మరోసారి గట్టిగా తన వాదనలు వినిపించింది. 2018లో కావేరి జలాల అంశంలో ఇచ్చిన తీర్పును గుర్తు చేసింది. జాతీయ స్థాయిలో అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే నదీ పరివాహక ప్రాంతంలోనే నీటి కేటాయింపులను చేపట్టాల్సి ఉంటుందని వివరించింది. ఇన్బేసిన్లోని రైతుల కుటుంబాలకు అన్యాయం జరగకుండా, వ్యవసాయ ఉత్పత్తులు పెరిగేలా నీటి కేటాయింపులను చేపట్టాలని తీర్పునిచ్చిందని గుర్తు చేసింది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణకు నీటి కేటాయింపులు అత్యావశ్యకమని స్పష్టం చేసింది. అయితే, రాష్ట్రంలో అనుమతులు లేకుండా ప్రాజెక్టులను ఎలా చేపడుతున్నారంటూ ట్రిబ్యునల్ ప్రశ్నించగా.. ఉమ్మడి ఏపీలోనే ఇప్పుడు చేపడుతున్న ప్రాజెక్టులను చేపట్టారని సమాధానమిచ్చింది. అందులోని కొన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లను 2006లోనే కేడబ్ల్యూడీటీ –2కు సమర్పించామని వివరించింది. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో సీడబ్ల్యూసీకి డీపీఆర్ ఇచ్చామని, వీలైనంత త్వరగా అనుమతి ఇవ్వాలని కోరామని తెలిపింది.
అయితే, ప్రస్తుతం నీటి కేటాయింపుల అంశం ట్రిబ్యునల్ పరిధిలో ఉండడంతో సీడబ్ల్యూసీ అనుమతులు ఇవ్వడంలో నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నదని పేర్కొన్నది. పాలమూరు జిల్లాలకు దశాబ్దాలుగా ఇరిగేషన్ విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని వివరించింది. కాగా, గతంలో కేడబ్ల్యూడీటీ –1కు 150 టీఎంసీల సామర్థ్యంతో తలపెట్టిన ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టు రిపోర్ట్‌ను సబ్మిట్ చేసినా ఆ ప్రాజెక్టు ఎలా ముందుకు కదల్లేదో ట్రిబ్యునల్‌కు వెల్లడించింది.