తెలంగాణ చరిత్రలోనే రికార్డ్.. ఒక్కరోజే 16 వేల 412 మెగా వాట్ల విద్యుత్ వినియోగం

తెలంగాణ చరిత్రలోనే రికార్డ్.. ఒక్కరోజే 16 వేల 412 మెగా వాట్ల విద్యుత్  వినియోగం

 

  • రాష్ట్ర చరిత్రలోనే శుక్రవారం అత్యధికంగా 16, 412 మెగావాట్లుగా నమోదు
  • గత ఐదారు రోజులుగా 16 వేల మెగావాట్లకు పైనే..
  • 317 మిలియన్ యూనిట్లతో రోజువారీ వినియోగంలోనూ రికార్డ్​

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో కరెంటు వినియోగం భారీగా పెరిగింది. దీంతో  రికార్డు స్థాయిలో విద్యుత్​ డిమాండ్​ నమోదవుతున్నది. గత వారం రోజులుగా రోజూ 16 వేల మెగావాట్లకుపైగా కరెంట్​​ డిమాండ్ ఉంటున్నది. శుక్రవారం రోజు చరిత్రలోనే అత్యధికంగా 16, 412 మెగావాట్ల పీక్​ డిమాండ్​ రికార్డయ్యింది. రోజువారీ వినియోగంలోనూ 313 మిలియన్​ యూనిట్ల (ఎంయూ)తో సరికొత్త రికార్డులు సృష్టించింది. మార్చి నాటికి మరిన్ని రికార్డులు తిరగరాసే అవకాశం ఉందని ఎలక్ట్రిసిటీ ఎక్స్​పర్ట్స్​ అంటున్నారు. 

అన్ని విభాగాల్లో పెరిగిన వినియోగం

వాతావరణ మార్పులతో వ్యవసాయానికి పెద్ద ఎత్తున కరెంట్​ అవసరమవుతున్నది. మరోవైపు ఎండ తీవ్రత పెరిగి ఉక్క పోతలతో పట్టణ ప్రాంతాల్లో ఏసీలు, ఫ్యాన్ల వినియోగం పెరిగింది.  గృహ వినియోగం పెరగడంతోపాటు ఇండస్ట్రీలు భారీగా కరెంటు వాడుతుండడంతో రాష్ట్రంలో  విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నది.  రాష్ట్రంలో దాదాపు 70 లక్షల ఎకరాల్లో యాసంగి సాగు జరిగింది. ఇందులో ఇప్పటికే 55లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. మరో 7 లక్షల ఎకరాలకు పైగా మక్కలు వేశారు.  నిరుటితో పోలిస్తే 5 లక్షల ఎకరాల్లో వరి, 2 లక్షల ఎకరాలకుపైగా మక్కల సాగు పెరిగింది. భూగర్భజలాలు పెరగడంతో రాష్ట్రవ్యాప్తంగా 29 లక్షల బోర్లు నడుస్తున్నాయి. పంటలకు నీళ్ల కోసం బోర్లపైనే రైతులు ఎక్కువగా ఆధార పడుతున్నారు. దీంతో కరెంటు డిమాండ్ భారీగా పెరిగింది

నెల రోజులుగా పీక్స్​కు..

గత నాలుగైదు రోజులుగా రోజూ 16 వేల మెగావాట్లకు పైగానే విద్యుత్​ డిమాండ్ నమోదవుతున్నది. శుక్రవారం రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 16,412 మెగావాట్లుగా రికార్డయింది. శనివారం 16, 287 మెగావాట్ల డిమాండ్ రికార్డు కాగా.. గురువారం 16,289,  బుధవారం 16,140 మెగావాట్ల డిమాండ్​ నమోదైంది.  గత వారం రోజులుగా రోజువారీగా 300 మిలియన్​ యూనిట్ల (ఎంయూ)కు పైగా కరెంట్​ వాడకం జరుగుతున్నది. శనివారం 308.50 , శుక్రవారం 313.36 , గురువారం 310.47, బుధవారం 307.63, మంగళవారం 303.42 ఎంయూల చొప్పున రోజువారీగా కరెంట్ వినియోగం రికార్డయింది. ఈ నెల ప్రారంభం నుంచి ప్రతిరోజూ కనీసం 14  వేల మెగావాట్లకు పైగానే డిమాండ్​ ఉంటున్నది.