పకడ్బందీగా భూభారతి గైడ్​లైన్స్​ : మంత్రి పొంగులేటి

పకడ్బందీగా భూభారతి గైడ్​లైన్స్​ : మంత్రి పొంగులేటి
  • పాత సమస్యలు ఉండొద్దు.. కొత్త సమస్యలు రావొద్దు: మంత్రి పొంగులేటి
  • అధికారులకు మంత్రి సూచనలు
  • భూ భారతి చట్టం విధివిధానాలపై ప్రారంభమైన వర్క్ షాప్ 

హైద‌రాబాద్ , వెలుగు: పాత సమస్యలను పరిష్కరించడంతోపాటు కొత్తగా ఎలాంటి సమస్యలు రాకుండా భూ భారతి గైడ్​లైన్స్​ను పకడ్బందీగా రూపొందించాలని ఉన్నతాధికారులను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ​రెడ్డి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, అధికారులు ఇకపై ఎలాంటి తప్పులు చేసే అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భూభారతి చట్టానికి సంబంధించి గైడ్​లైన్స్​ రూపొందించడంపై హైదరాబాద్​లోని ఎంసీఆర్​హెచ్​ఆర్డీ సెంటర్​లో క‌లెక్టర్లు, ఇత‌ర ఉన్నతాధికారుల‌కు రెండు రోజుల వర్క్​షాప్ మంగళవారం ప్రారంభమైంది.

 ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి హాజరై మాట్లాడారు. భూ పరిపాలనలో కొత్త రెవెన్యూ చట్టం భూభారతి పెను మార్పులను తీసుకువస్తుందన్నారు. సెక్రటేరియెట్​లో కూర్చొని రూల్స్ ఫ్రేమ్ చేయకుండా విస్తృత స్థాయిలో అధికారులు, మేధావులు, అనుభ‌వ‌జ్ఞుల స‌ల‌హాలు సూచ‌న‌లు తీసుకొని, అంద‌రి అభిప్రాయాల‌ను క్రోడీక‌రించి, ప‌క‌డ్బందీగా భూ భార‌తి విధివిధానాలు చేపట్టా లని సూచించారు. వీలైనంత త్వరగా భూభార‌తి చ‌ట్టాని కి  విధివిధానాల‌ను రెడీ చేసి అమల్లోకి తేవాలన్నారు.

భ‌విష్యత్​లో అధునాతన సాంకేతిక‌త‌ పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ మరింత సమర్థవంతంగా భూభారతి కొన‌సాగిస్తామని తెలిపారు. ఈ నూత‌న చ‌ట్టం భూ యాజ‌మాన్య హ‌క్కుల‌ను కాపాడడంతోపాటు  రైతులకు ఆత్మగౌర‌వాన్ని, ఆర్థిక స్వాతంత్య్రాన్ని తీసుకువ‌స్తుందని మంత్రి పేర్కొన్నారు. 

చ‌ట్టం రూప‌క‌ల్పన‌కు ఎంత క‌ష్టప‌డ్డామో ఈ చ‌ట్టానికి సంబంధించిన విధివిధానాల‌ను త‌యారీకి కూడా అదేస్థాయిలో క‌స‌ర‌త్తు చేయాల‌ని అధికారుల‌కు ఆయన సూచించారు. ఈ సమావేశంలో రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, సీసీ‌ఎల్‌ఏ పీడీ సీ‌ఎం‌ఆర్‌వో మకరంద్, భూ చట్ట నిపుణుడు భూమి సునిల్, రంగారెడ్డి, మేడ్చల్-  మల్కాజ్​గిరి, వికారాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల కలెక్టర్లు  పాల్గొన్నారు.   

ధరణిలో అన్నీ లొసుగులు, లోపాలే

గత సర్కారు ఎలాంటి విధి విధానాలు రూపొందించకుండా 2020 ఆర్వోఆర్ చ‌ట్టం తీసుకువచ్చిందని, దాని వల్ల ఎన్నో సమస్యలు ఎదురయ్యాయని, ల‌క్షలాది మంది రైతులు రోడ్డునప‌డ్డారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. ‘‘ఆనాటి పాలకులు గొప్పగా చెప్పుకున్న ధరణిలో అన్నీ లొసుగులు, లోపాలే ఉన్నాయి. ఆ చ‌ట్టం తీసుకువచ్చి మూడేండ్లు గ‌డిచినప్పటికీ ఆనాటి ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలు రూపొందించ‌లేదు. 

కానీ భూభారతి చట్టం అలా కాదు. భూ హ‌క్కుల‌ను ర‌క్షించ‌డం, భూ వ్యవ‌హారాల్లో పార‌ద‌ర్శక‌త తీసుకురావ‌డం, భూ లావాదేవీల‌ను సుల‌భ‌త‌రం చేయ‌డం, సామాన్యుల‌కు కూడా రెవెన్యూ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకురావ‌డం కొత్త చ‌ట్టం ప్రధాన ల‌క్ష్యం.  ఈ చ‌ట్టం త‌ర‌త‌రాల భూ స‌మ‌స్యల‌కు శాశ్వత ప‌రిష్కారం చూపుతుంది” అని ఆయన తెలిపారు.