
- నిర్మల్, నిజామాబాద్‌లో45.4 డిగ్రీలు నమోదు
- 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- నేటి నుంచి 3 రోజులు ఉష్ణోగ్రతలు తగ్గే చాన్స్
- ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం: ఐఎండీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శుక్రవారం 6 జిల్లాల్లో 45 డిగ్రీలకన్నా ఎక్కువ టెంపరేచర్లు నమోదయ్యాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా తానూరు, నిజామాబాద్ జిల్లా పెర్కిట్‌లో 45.4 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. జగిత్యాల జిల్లా ఐలాపూర్‌లో 45.3, ఆదిలాబాద్ జిల్లా చాప్రాలలో 45.2, మంచిర్యాల జిల్లా భీమినిలో 45.1, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జోగుళాంబ గద్వాల, నల్గొండ జిల్లాల్లో 44.9, కామారెడ్డిలో 44.6, పెద్దపల్లిలో 44.5, కరీంనగర్లో 44.4 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి. 6 జిల్లాల్లో 43.1 నుంచి 43.9 మధ్యన, 14 జిల్లాల్లో 42 నుంచి 42.9 మధ్య, 2 జిల్లాల్లో 41.6, 41.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్సిటీలోని సైదాబాద్‌లో 42, కుత్బుల్లాపూర్‌లో 42.4 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి.
నేటి నుంచి కొంత తగ్గుముఖం
రాష్ట్రంలో శనివారం నుంచి 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు కాస్తంత తగ్గే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ 3 రోజులూ పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లోనూ వర్షాలు పడుతాయని వెల్లడించింది.