కరీంనగర్​ జిల్లా మొత్తం సుడా పరిధిలోకి...209 గ్రామాలు, 4 మున్సిపాలిటీలు

కరీంనగర్​ జిల్లా మొత్తం సుడా పరిధిలోకి...209 గ్రామాలు, 4 మున్సిపాలిటీలు

 

  • ఒక కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంతా పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకే.. 
  • రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం వీటీడీఏ పరిధిలోకి 
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 

కరీంనగర్/వేములవాడ, వెలుగు: కరీంనగర్ జిల్లా మొత్తాన్ని శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(సుడా) పరిధిలోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోపాటు వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ(వీటీడీఏ) పరిధిని కూడా 152 రెవెన్యూ గ్రామాలకు విస్తరిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎక్కువగా నిధులు రాబట్టుకోవడంతోపాటు లే అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్జీలు, బిల్డింగ్ పర్మిషన్ల ద్వారా స్వయం సమృద్ధి అయ్యేందుకు సుడా పరిధిని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించించిందని పేర్కొంటూ 'జిల్లా మొత్తం సుడా పరిధిలోకి' అనే హెడ్డింగ్ తో ఈ నెల 14న ‘వెలుగు’లో స్టోరీ పబ్లిష్ అయిన విషయం తెలిసిందే.

మరుసటి రోజే ఆ ప్రభుత్వం ఆమోదముద్ర వేసినప్పటికీ.. శుక్రవారం ఉత్తర్వులు సుడా ఆఫీసుకు చేరాయి. ప్రస్తుతం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటు 62 గ్రామాలు సుడా పరిధిలో ఉన్నాయి. వీటితోపాటు ఇప్పుడు మరో 147 గ్రామాలు, 3 మున్సిపాలిటీలను కలుపుతూ పట్టణాభివృద్ధి సంస్థ పరిధిని విస్తరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో జిల్లాలో ఏ గ్రామ పరిధిలోనైనా ఏర్పాటయ్యే లే అవుట్లు, బిల్డింగ్ నిర్మాణాలకు సుడా స్థాయిలోనే పర్మిషన్లు మంజూరు కానున్నాయి.

సిరిసిల్ల మొత్తం వీటీడీఏ పరిధిలోకి..

వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(వీటీడీఏ) పరిధిని పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పట్టణంతోపాటు వేములవాడ అర్బన్ మండలం మాత్రమే వీటీడీఏ పరిధిలో ఉంది. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల మున్సిపాలిటీతోపాటు బోయినిపల్లి, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్,  గంభీరావుపేట, చందుర్తి, రుద్రంగి, వేములవాడ రూరల్, కోనరావుపేట మండలాలకేంద్రాలతోపాటు 152 రెవెన్యూ గ్రామాలను వీటీడీఏ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 

ఇక సులువుగా అనుమతులు.. 

ప్రస్తుతం సుడా, వీటీడీఏ పరిధి అవతల ఉన్న మున్సిపాలిటీలు, జీపీల్లో లేఅవుట్లు వేయాలన్నా, జీ ప్లస్ 3 బిల్డింగ్స్ నిర్మించాలన్నా హైదరాబాద్ లోని డీటీసీపీ అప్రవూల్ కు వెళ్లాల్సి ఉంది. కానీ ఆయా గ్రామాలు, మున్సిపాలిటీలు ఆయా పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వస్తే కరీంనగర్ లోని సుడా, వేములవాడలోని వీటీడీఏలోనే ఈ అనుమతులు పొందవచ్చు. తద్వారా పట్టణాభివృద్ధి సంస్థలకు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. 

బాధ్యత పెరుగుతుంది.. 

సుడా పరిధిని జిల్లావ్యాప్తం చేయడం సంతోషకరం. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో చాలా తక్కువ విస్తీర్ణంతో సుడాను ఏర్పాటు చేశారు. దీంతో సుడాకు సొంతంగా పెద్దగా ఆదాయం రావడం లేదు. సుడా నిధులతో అభివృద్ధి పనులు కూడా అంతంత మాత్రంగా జరిగాయి. పట్టణాభివృద్ధి సంస్థ విస్తరణతో మా బాధ్యత రెట్టింపవుతుంది. ఇందుకనుగుణంగా స్టాఫ్ ను పెంచుకోవాల్సి ఉంటుంది. సమగ్రాభివృద్ధికి అందరితో కలిసి కృషి చేస్తాం. - కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సుడా చైర్మన్