తెలంగాణను ప్రకృతివనంగా మారుస్తం : సీఎం రేవంత్​రెడ్డి

తెలంగాణను ప్రకృతివనంగా మారుస్తం : సీఎం రేవంత్​రెడ్డి
  • త్వరలో ప్రత్యేక  టూరిజం పాలసీ తీసుకొస్తం: సీఎం రేవంత్​రెడ్డి
  • టెంపుల్, ఎకో, హెల్త్​ టూరిజంపై స్పెషల్​ ఫోకస్​ పెట్టినం
  • రైతులు మూడేండ్ల వరకు మొక్కలు పెంచితే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది  
  • తల్లి పేరిట విద్యార్థులు మొక్కలు నాటి సంరక్షించే విధానం తీసుకొస్తామని వెల్లడి
  • రంగారెడ్డి జిల్లాలో ఎక్స్ పీరియం పార్కు ప్రారంభం

చేవెళ్ల, వెలుగు:  రాష్ట్రంలో త్వరలోనే పర్యాటక పాలసీ తీసుకువచ్చి, ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణను ప్రకృతివనంగా మారుస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలం పొద్దుటూరు శివారులో 150 ఎకరాల్లో ఉన్న ఎక్స్ పీరియం ఎకో పార్కును నటుడు చిరంజీవి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎక్స్ పీరియం చైర్మన్ రామడుగు రామ్ దేవ్ రావు, వనజీవి రామయ్య తదితరులతో కలిసి సీఎం రేవంత్​రెడ్డి మంగళవారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే టెంపుల్, హెల్త్, ఎకో టూరిజం పాలసీలను తీసుకురావాలని అనుకుంటున్నామని,  అయితే, అంతకంటే ముందే ఎక్స్ పీరియం చైర్మన్ రామ్ దేవ్ రావు ఒకడుగు ముందుకు వేసి 150 ఎకరాల్లో అద్భుతమైన ఎకో ఫ్రెండ్లీ పార్కును సృష్టించారని కొనియాడారు. ఈ పార్కు వల్ల రాష్ట్రానికి గుర్తింపు, గౌరవం, ఆదాయం వస్తుందని చెప్పారు.   రాష్ట్రంలో టెంపుల్, హెల్త్​, ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే టూరిజం పాలసీపై మంత్రి జూపల్లితో చర్చించామని తెలిపారు. 

త్వరలోనే విధివిధానాలు తీసుకువస్తామని చెప్పారు. ఫంక్షన్ల కోసం సెలబ్రిటీలు ఇతర దేశాలు, రాష్ట్రాలకు, టెంపుల్స్​కోసం తమిళనాడుతోపాటు వేరే స్టేట్స్​కు, ఫారెస్ట్​, ప్రకృతి అందాల కోసం ఎంపీకి వెళ్తున్నారని అన్నారు. రాష్ట్రంలో తీసుకురాబోయే టూరిజం పాలసీ వల్ల భవిష్యత్తులో అన్నీ ఇక్కడే అందుబాటులో ఉంటాయని చెప్పారు.  

ఇంతకుముందు ప్రముఖులు ఇండ్లు కట్టుకుంటే గోదావరి జిల్లాల నుంచి మొక్కలు తెప్పించుకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు చేవెళ్ల, వికారాబాద్​ప్రాంతాల నుంచి, ఎక్స్ పీరియం నుంచి మొక్కలు తెచ్చుకునేటట్టు చేశారన్నారు. ఎక్స్ పీరియంలో ఇప్పుడు  జరిగిన అభివృద్ధి 30 శాతమేనని, రాబాయే ఏడాదిలో ఇదొక అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  వికారాబాద్​ను ఎకో టూరిజానికి అడ్డాగా మారుస్తామని చెప్పారు.  రాష్ట్రంలో రామప్ప, నల్లమల, కవ్వాల్​ఫారెస్ట్, ఇలా ఎన్నో సుందర ప్రదేశాలున్నాయని, వాటిని అభివృద్ధి చేస్తామన్నారు. 

ఆ మొక్కలు దొరకడం సంతోషం: జూపల్లి

విదేశాల్లో దొరికే మొక్కలు హైదరాబాద్ లోనూ లభించడం సంతోషాన్నిస్తున్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ సందర్భంగా ఎక్స్ పీరియం చైర్మన్ రామ్ దేవ్ రావును అభినందించారు.  అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘పార్కులో మొక్కలను చూస్తుంటే టెంప్టింగా ఉంది. రామ్ దేవ్ రావు పడిన కష్టం, శ్రమ కనిపిస్తున్నది. ఇన్ని ఎకరాలు, డబ్బులు ఉంటే మల్టీ స్టోర్​డ్​ భవనాలు కట్టుకుంటే తరతరాలు నిలిచిపోతుంది. కానీ ఆయన మదిలో ఉన్న ఈ ఆలోచన చూసి నేను, సీఎం ముచ్చటపడుతున్నాం’’ అని అన్నారు.

  ‘‘ఫిల్మ్ షూటింగ్​లకు ఈ లోకేషన్​ ఇస్తారా? అని రామ్​దేవ్​ రావును అడిగా.  ఫస్ట్​నా సినిమా షూటింగ్​కే ఇస్తానని అన్నారు. కానీ నేను ఇప్పటికిప్పుడు ఇక్కడ హీరోయిన్ తో స్టెప్పులు వేయలేను. త్వరలో కచ్చితంగా చేస్తా” అని తెలిపారు. త్వరలో ఇక్కడ ఐస్ స్కేటింగ్ ఏర్పాటు చేస్తానని అంటున్నారని, అద్భుతమైన ఆలోచన అని చెప్పారు. ప్రారంభోత్సవానికి పిలవగానే వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర అతిథులకు ఎక్స్ పీరియం చైర్మన్ రామ్ దేవ్ రావు కృతజ్ఞతలు తెలిపారు. 

అనంతరం ఆసియాలోనే అతిపెద్ద యాంపి థియేటర్ వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఎక్స్ పీరియం గురించి సోషల్ పోస్ట్ డిజిటల్ మీడియా రూపొందించిన ఆడియో -విజువల్ (ఏవీ)ని సీఎం లాంచ్​ చేశారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, గ్రీన్ హార్ట్ ఆఫ్ ఇండియా దుశర్ల సత్యనారాయణ, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్, సీఎం రమేశ్, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, రైటర్ విజయేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

పెన్షన్​ పెంచండి: వనజీవి రామయ్య  

స్టేజీకి ఎదురుగా కూర్చొని ఉన్న  వనజీవి రామయ్యను చూసిన  సీఎం రేవంత్​.. వారిని స్టేజీ పైకి తీసుకురావాలని  కోరారు. దీంతో సీఎం సెక్యూరిటీ వెళ్లి రామయ్యను పైకి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా వనజీవి రామయ్యతో సీఎం రేవంత్ ముచ్చటించారు. కాగా,  ప్రస్తుతం నెలనెలా  రూ.15వేల పింఛన్​ వస్తున్నదని, అది సరిపోవడం లేదని, పింఛన్​రూ.లక్షకు పెంచాలని సీఎంను వనజీవి రామయ్య దంపతులు రిక్వెస్ట్​చేశారు.

మొక్కలు పెంచితే మేమే కొంటాం 

మన రైతులు ఎక్స్​పీరియం తరహాలో మొక్కలను పెంచితే జనాలు కొనుగోలు చేసేలా ప్రభుత్వం చూసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి​ తెలిపారు. కొంతమంది రైతులు కేవలం ఆరు నెలలే మొక్కలు  పెంచుతున్నారని, దీంతో అవి 20 నుంచి 30 శాతానికి మించి బతకడం లేదన్నారు. 2, 3 ఏండ్లు నిండే వరకు మొక్కలు పెంచి, వాటిని తీసుకెళ్లి నాటితే ఎక్కువగా బతుకుతాయని చెప్పారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారు లకు ఆదేశాలు ఇస్తానని తెలిపారు. తల్లి పేరిట విద్యార్థులు మొక్కలు నాటి సంరక్షించే విధానం తీసుకొస్తామని, త్వరలో విధివిధానాలు ఖరారుచేస్తామని అన్నారు. దీనివల్ల రాష్ట్రంలో కొన్ని కొట్లాది మొక్కలను పెంచవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.