
- ప్రమాదాలు ఎక్కువ జరిగే చోట అంబులెన్స్‌లు: మంత్రి దామోదర రాజనర్సింహ
- పేషెంట్లను ప్రైవేట్ హాస్పిటల్స్‌కు రెఫర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
తూప్రాన్/ నర్సాపూర్, వెలుగు: రాష్ట్రంలో రహదారులపై ప్రతి 35, 40 కి.మీ.కు ఒక ట్రామా సెంటర్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదరరాజనర్సింహ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7,500 ట్రామా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అలాగే, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచుతామన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటుచేసిన డయాలసిస్ సెంటర్‌ను శుక్రవారం మంత్రి ప్రారంభించారు.
అనంతరం హాస్పిటల్ లో రోగులతో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని తెలుసుకున్నారు. ఆ తర్వాత టోల్ గేట్ దగ్గర ఉన్న బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్లో స్టూడెంట్లతో కలిసి భోజనం చేశారు. అంతకు ముందు నర్సాపూర్‌లో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగంలో నూతన పాలసీని తీసుకొస్తున్నదని తెలిపారు. గత కొంతకాలంగా కొందరు డాక్టర్లు, సూపరింటెండెంట్లు పేషెంట్లను ప్రైవేట్ హాస్పిటల్స్‌కు రిఫర్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టినట్టు తెలిపారు.
అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని హెల్త్ సెంటర్లలో సీసీ కెమెరాల ద్వారా సిబ్బంది పనితీరును పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. నర్సాపూర్ కు ట్రామా సెంటర్ తోపాటు, సీటీ స్కాన్ సెంటర్, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను త్వరలో మంజూరు చేస్తామన్నారు. ప్రమాదాలకు కారణం వ్యసనాలని, సమాజాన్ని, పిల్లల్ని వ్యసనాల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ నగేష్, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసినిరెడ్డి, గజ్వేల్మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, డీసీసీ ప్రసిడెంట్ఆంజనేయులు గౌడ్, డీఎంహెచ్ఓ డాక్టర్శ్రీరామ్, డీసీహెచ్ డాక్టర్ శివ దయాల్, తూప్రాన్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అమర్ సింగ్ పాల్గొన్నారు.