- కృష్ణమ్మ ఒడిలో రెండో దఫా లాంచీ ప్రయాణం
కొల్లాపూర్, వెలుగు: తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన లాంచీ రెండో విడత శనివారం ఉదయం 10 గంటలకు కొల్లాపూర్ మండలం సోమశిల నుంచి శ్రీశైలనికి 120 మందితో కార్తీక మాసాన బయలుదేరింది. లాంచీ ప్రయాణం కోసం శుక్రవారం సాయంత్రం వరకు ఆన్ లైన్ లో పర్యాటకులు,భక్తులు బుక్ చేసుకోగా, శనివారం బయలుదేరారు. ఈ లాంచీలో 120 సీట్ల కెపాసిటీ కాగా 120 మంది పర్యాటకులు ప్రయాణించడం విశేషం.
అయితే తొలిసారిగా ఈ నెల 2న సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం కోసం బుక్ చేసుకున్న 80 మందితో పర్యాటక శాఖ ప్రారంభించిన విషయం తెలిసిందే.90 కిలోమీటర్ల దూరం, 6 గంటల పాటు కృష్ణానదిలో అలలపై ,ప్రయాణంలోమధురానుభూతిని పొందుతూ సాయంత్రం 4 గంటలకు శ్రీశైలానికి చేరుకోనుంది. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శనం అనంతరం భక్తులు ఆదివారం తిరిగి సోమశిల కు లాంచీలో చేరుకోనున్నారు. సోమశిల నుంచి తూర్పున ఉన్న శ్రీశైల క్షేత్రానికి లాంచీలో మార్గమధ్యలో చూడదగిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.
అందులో మల్లయ్య శిల పుణ్యక్షేత్రం,అమరగిరి గ్రామం, కోతిగుండు, చీమలతిప్ప ద్వీపకల్పం,గుండ్లపెంట చెంచు గూడెం,చుక్కల గుండం ఈ ప్రదేశం లో కొద్ది దూరం పగలు ఆకాశంలోచుక్కలుకనిపిస్తాయి అక్కమహదేవి గుహాలు, శ్రీశైలానికి చేరుకుంటారు. ఈసారి తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు, భక్తులు శ్రీశైలం లాంచీ ప్రయాణం చేయనున్నారు.
అయితే లాంచీ ప్రయాణం ఏర్పాట్లను రాష్ట్ర పర్యటన శాఖ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సైదులు, కొల్లాపూర్ అటవీ శాఖ రేజర్ అధికారి చంద్రశేఖర్, నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ పర్యవేక్షించారు. సోమశిల నుంచి శ్రీశైలానికి పెద్దలకు రానుపోను రూ,3వేలు, వన్ వే కు రూ,2వేలు,పిల్లలకు రానుపోను రూ, 2400 లు, వన్ వేకు రూ, 1600 లు వసూలు చేస్తున్నట్లు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.