నిజామాబాద్/డిచ్పల్లి, వెలుగు : ఒక వైపు విజిలెన్స్ తనిఖీలు.. మరోవైపు ఔట్ సోర్సింగ్‌ఉద్యోగుల ఆందోళనలతో తెలంగాణ యూనివర్సిటీలో అట్టుడికింది. ఉద్యోగులు వంట పనులు ఆపేసి ఆందోళనకు దిగడంతో స్టూడెంట్లు పస్తులు ఉండాల్సివచ్చింది. లంచ్ లేకపోవడంతో స్టూడెంట్స్అడ్మిన్ బిల్డింగ్ ముందు బైఠాయించారు. మంగళవారం వర్సిటీలో రెండో దఫా విజిలెన్సు సోదాలు జరిగాయి. నలుగురు ఆఫీసర్ల టీం కీలక డిపార్ట్మెంట్లలో పలు ఫైల్స్ స్వాధీనం చేసుకొని హైదరాబాద్ తీసుకుళ్లారు. విజిలెన్స్టీం ఉదయమే వర్సిటీ చేరుకుంది. అదనపు ఎస్పీ శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఆఫీసర్లు ఏఏ అంశాలకు సంబంధించి తనిఖీలు చేయాలో ముందుగానే అనుకుని వచ్చినట్టు తెలుస్తోంది.
పాలక మండలి ఆమోదం లేకుండా వీసీ రవీందర్‌గుప్తా చేసిన అడ్డగోలు ఖర్చులు, నిబంధనలకు విరుద్ధంగా చేసిన ఉద్యోగుల అపాయింట్మెంట్లపై ఫోకస్‌పెట్టారు. ఆయన కొనుగోలు చేయించిన ఫర్నిచర్‌ను ఆర్ట్స్ కాలేజీకి వెళ్లి చూశారు. విజిలెన్స్ అడిగిన ఫైళ్లను అకౌంట్స్ ఆఫీసర్ భాస్కర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయాగౌడ్అందజేశారు. ఈనెల 6న ఏసీబీ, విజిలెన్స్ జాయింట్ సోదాలు చేయగా.. ఈసారి విజిలెన్స్ వారు మాత్రమే వచ్చారు.
రిజిస్ట్రార్ ఆఫీసుకు లాక్
విజిలెన్సు తనిఖీలు కొనసాగుతున్నంత సేపు రిజిస్ట్రార్ ఆఫీసుకు తాళం వేసి ఉంది. రిజిస్ట్రార్‌గా ఈసీ సభ్యులు నియమించిన యాదగిరి, వీసీ అపాయింట్ చేసిన కనకయ్య ఇద్దరూ వర్సిటీకి రాలేదు. అకౌంట్స్ ఆఫీసర్ భాస్కర్‌పై ఆరోపణలు రావడంతో వాటిపైన ఆయనను ఆఫీసర్లు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి వర్సిటీకి బయలుదేరిన వీసీ రవీందర్‌గుప్తా కు విజిలెన్స్సోదాల సమాచారం తెలుసుకుని భిక్కనూర్నుంచి వెనక్కి వెళ్లినట్టు సమాచారం.
జీతాల ఆందోళన
జీతాలు రాక అవస్థలుపడుతున్నామని 276 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనులు మానేసి ఆందోళనకు దిగారు. హాస్టల్లో పనిచేసే వందమంది కూడా ఆందోళనలో పాల్గొన్నారు. వారంతా ధర్నాలో పాల్గొని.. ఉదయం టిఫిన్లు కూడా పెట్టలేదు. మధ్యాహ్నం లంచ్ కోసం మెస్‌కు వెళ్లిన స్టూడెంట్లు వంటలే చేయలేదని తెలిసి ఆందోళనకు దిగారు. ఆధికారులపై కోపంతో తమను పస్తులు ఉంచడంఏమిటని స్టూడెంట్లు నిరసన వ్యక్తం చేశారు. వంటపనివారిని ఆందోళన విరమించాలని చీఫ్ వార్డెన్ మహేందర్కోరినా వారు వినలేదు. 13 తేదీవచ్చినా జీతాలివ్వకుంటే ఎలా బతుకుతామని, జీతాలిచ్చేదాక ఆందోళన విరమించేదిలేదని మొండికేశారు. దాంతో రాత్రి భోజనాన్ని బయట నుంచి తెప్పిస్తానని వార్డెన్ స్టూడెంట్లకు నచ్చచెప్పడంతో వారు శాంతించారు.
చెక్ పవర్ ఎవరిది ..
వర్సిటీలో బ్యాంకు నుంచి చెక్కులను డ్రా చేసే అధికారం రిజిస్ట్రార్‌కే ఉంటుంది. గత నెలలో రిజిస్ట్రార్ల కూర్చీలాట ఆయోమయానికి కారణమైంది. ఎవరిని రిజిస్ట్రార్‌గా గుర్తించాలని బ్యాంకు అధికారులు రాష్ట్ర ఉన్నత విద్యామండలికి లెటర్ రాయగా.. యాదగిరికి పవర్స్ ఇస్తున్నట్టు సమాధానం ఇచ్చారు. దీంతో గతనెల 9 న జీతాలు చెల్లించారు. ఈనెల కూడా యాదగిరి, కనకయ్యలపై వివాదం కొనసాగింది. జీతాల కోసం సుమారు రూ.3.25 కోట్లు బ్యాంకులో జమచేసినా రిజిస్ట్రార్ వివాదం వల్ల జీతాల చెల్లింపు జరగలేదు.