హైదరాబాద్: కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం నుంచి తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు వాకౌట్ చేశారు. కేఆర్ఎంబీ చైర్మన్ ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ అధికారులు సమావేశం నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు. చాలా కాలంగా వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సమావేశం ఎట్టకేలకు బుధవారం ఎర్రమంజిల్ లోని జల సౌధలో జరిగింది. ఏపీ-తెలంగాణ రెండు ప్రభుత్వాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న నేపధ్యంలో సమావేశంపై ఉత్కంఠ ఏర్పడింది. ఈ నేపధ్యంలో రెండు రాష్ట్రాల అధికారులు కసరత్తు చేశారేమో సమావేశం సుదీర్ఘంగా 5 గంటలకుపైగా సాగింది.
కృష్ణా జలాలపై రెండు రాష్ట్రాల వాటాల గురించి సమావేశంలో చర్చ జరిగింది. అయితే శ్రీశైలం వద్ద చేపట్టిన జల విద్యుత్ ఉత్పత్తిపైనే పీటముడి పడినట్లు సమాచారం. శ్రీశైలం డ్యాం వద్ద తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంపై చైర్మన్ ఎంపీ సింగ్ ప్రస్తావిస్తూ.. శ్రీశైలం నుంచి నీటి విడుదల చేయాలంటే దిగువన నాగార్జునసాగర్ , కృష్ణా డెల్టా ఆయకట్టులో సాగు, తాగునీటి అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే చేయాలని స్పష్టం చేసినట్లు సమాచారం. కేఆర్ఎంబీ ఛైర్మన్ నిర్ణయాన్ని తెలంగాణ అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. సమావేశం నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు.