ఎస్సారెస్పీ నుంచి సాగునీరు విడుదల నిలిపివేత

ఎస్సారెస్పీ నుంచి సాగునీరు విడుదల నిలిపివేత
  • ఈ నెల 9 నుంచి అమలు ఇక తాగునీటికి వినియోగం

నిర్మల్, వెలుగు: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిధిలోని కాకతీయ కాలువ (ఎల్ఎండీ) పైన సరస్వతి కాలువ, లక్ష్మి కాలువతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్​లకు ఈ నెల 9 ఉదయం నుంచి నీటి విడుదల నిలిపివేయనున్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించిన సాగునీటి ప్రణాళిక ప్రకారం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎస్సారెస్పీ ఎస్ఈ శ్రీనివాసరావు గుప్తా ఈ విషయంపై ప్రకటన జారీ చేశారు. 

బుధవారం ఉదయం 6 గంటల వరకు చివరి తడి కోసం నీరందించనున్నామని, అప్పటివరకు రైతులు సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. మిగిలిన నీటిని నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల ప్రజల తాగునీటి కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకూడదనే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాలువల్లో నీటి ప్రవాహం ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రజలెవరూ కాలువల సమీపాల్లోకి రావద్దని సూచించారు.