సంక్షేమ హాస్టల్స్​ను మెరుగుపరచాలి

సంక్షేమ హాస్టల్స్​ను  మెరుగుపరచాలి

ఇటీవల కాలంలో 574  హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్  ఫలితాలు  తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం  విడుదల  చేసింది.  అతి త్వరలో  తెలంగాణ రాష్ట్రంలోని  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ  సంక్షేమ హాస్టళ్లకు నూతన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ 2025–2026 నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి విధులకు హాజరుకానున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నదనే  కారణంతో  మూతపడిన సంక్షేమ హాస్టల్స్​ను  వచ్చే విద్యా సంవత్సరం తిరిగి పునః ప్రారంభించాలి.  

పేద విద్యార్థులు గ్రామాల నుంచి  పట్టణాలకు వెళ్లి  ప్రభుత్వ విద్యాసంస్థలలో చదువుకుంటున్నారు. వారికి సంక్షేమ హాస్టళ్లలో వసతి కల్పించాలి.  ప్రభుత్వ విద్యాసంస్థలలో అడ్మిషన్  పొందుతున్న సమయంలో హాస్టల్ అడ్మిషన్ కూడా ఒకేసారి ఇచ్చేవిధంగాప్రభుత్వం ప్రణాళిక రూపొందించాలి.   విద్యాసంస్థకు, హాస్టల్ వసతికి ఒకేసారి అడ్మిషన్ ఇచ్చేవిధంగా ప్రభుత్వం కృషి చేయాలి.  ఆర్థిక  స్తోమత లేని కొందరు విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు.

  సంక్షేమ హాస్టల్స్ ఆసరాగా ఉండి వసతి కల్పించాలి.  హాస్టళ్లలో ఉదయం సాయంత్రం స్టడీ అవర్ కొనసాగించాలి.  అందుకుగాను గతంలో వలె హాస్టల్ విద్యా వాలంటీర్, సబ్జెక్టులవారీగా ట్యూటర్స్​ను ప్రతి హాస్టల్​కు విద్యార్థుల విద్యాభివృద్ధికిగాను  నియమించాలి. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ప్రతి సంక్షేమ హాస్టల్స్ లో అడ్మిషన్లు ప్రారంభించాలి.  ఆరోగ్య కేంద్రం సిబ్బంది చేత  వైద్య శిబిరాలు నిర్వహించాలి. క్రీడలను ప్రోత్సహించడానికి గాను ఫిజికల్ డైరెక్టర్లను నియమించాలి. ప్రతి సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులను కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు, అధికారులు, సంక్షేమ హాస్టల్స్  అభివృద్ధికిగాను విద్యార్థుల విద్యాభివృద్ధికిగాను కృషి చేయవలసిందిగా మనవి.  

  - డా. ఈదునూరి వెంకటేశ్వర్లు