- ఓ షెడ్డులో పామును పట్టుకున్న తండ్రి
- కొడుకుతో కలిసి దానితో చెలగాటమాడుతూ ఫొటోలు
- కాటు వేయడంతో కొడుకు మృతి
బాన్సువాడ, వెలుగు: కొడుకుతో కలిసి కోడెనాగుతో చెలగాటమాడిన ఓ తండ్రికి తీరని విషాదం మిగిలింది. కోడెనాగును ముద్దాడుతూ రీల్స్ తీసి సోషల్ మీడియాలో పెట్టి పాపులర్ అయిపోవాలనుకున్న ఆ యువకుడి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. దేశాయిపేటకు చెందిన మోచి గంగారాంకు పాములు పట్టడంలో మంచి నైపుణ్యం ఉంది. గురువారం గ్రామ శివారులోని ఒక షెడ్డులో నాగుపాము ఉందని తెలిసి తన కొడుకు మోచి శివరాజ్(20)తో కలిసి అక్కడకు వెళ్లాడు.
ఇద్దరు కలిసి పామును పట్టుకున్నారు. పాముతో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దామని తండ్రి చెప్పగా.. శివరాజ్ ఆ పామును పట్టుకుని రకరకాలుగా ఫొటోలకు పోజులిస్తూ, వీడియో తీసుకున్నాడు. తర్వాత పాము తలను నోటిలో పెట్టుకుని ఫొటో దిగాడు. చివరగా పామును ముద్దాడుతూ ఫొటో దిగేందుకు ప్రయత్నించడంతో అది కాటు వేసింది. వెంటనే శివరాజ్‌ను బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. చాలాసార్లు పాములను పట్టుకున్నా ఏమీ కాలేదన్న ధైర్యంతోనే పాముతో ఫొటోలు దిగాలని తన కొడుకుకు చెప్పానని.. ఇప్పుడు అదే తప్పు కొడుకును దూరం చేసిందని తండ్రి గంగారాం విలపిస్తున్నాడు.